'భారతరత్న' పురస్కారం ఎప్పుడు ప్రారంభమైంది.. ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు..?
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'. ఈ అవార్డును 1954 జనవరి 2న, తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో ప్రారంభించారు. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అసాధారణ సేవలందించిన వారికి ఈ అవార్డును అందజేస్తారు. భారతరత్న అవార్డు అందుకున్న వారు దీనిని గొప్ప గౌరవంగా భావిస్తారు. 1954లో కేవలం బతికి ఉన్నవారికే ఈ అవార్డు అందించేవారు. అయితే తర్వాత మరణించిన వారికి కూడా అవార్డు అందించడం జరుగుతుంది. ది గెజిట్ ఆఫ్ ఇండియాలో నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అవార్డు గ్రహీతల పేర్లు అధికారికంగా ప్రకటిస్తారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఈ అవార్డులను అందుకున్న వారిని రాష్ట్రపతి గౌరవంగా సత్కరిస్తారు. ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే భారతరత్న ఇస్తారు.
కర్పూరీ ఠాకూర్‌కు ప్రకటన..
తాజాగా బిహార్ రాష్ట్రానికి చెందిన దివంగత ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రాష్ట్రంలోని మైనారిటీలు, బీసీలు, ఓబీసీలు ఆరాధించే జన్ నాయక్‌గా ఆయన పేరు పొందారు. కర్పూరీ ఠాకూర్ శతజయంతి సందర్భంగా ఈ అవార్డును ప్రకటించారు. 1924 జనవరి 24వ తేదీన బిహార్‌లోని సమస్థిపూర్ జిల్లాలోని పితోంఝియా గ్రామంలో నాయీబ్రాహ్మణ సామాజిక వర్గంలో కర్పూరీ ఠాకూర్ జన్మించారు. 1952లో సోషలిస్టు పార్టీ తరఫున బిహార్ అసెంబ్లీకి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించే ముంగేరీలాల్ కమిషన్ సిఫార్సులను అమలు చేశారు. కులవివక్షకు వ్యతిరేకంగా కర్పూరీ జీవితాంతం పోరాడారు.
మథర్ థెరీస్సా, నెల్సన్ మండేలాకు..
భారతరత్న అందుకున్న వారిలో ఇతర దేశస్తులు కూడా ఉన్నారు. ఈ అవార్డు అందుకున్న ఏకైక పాకిస్తానీ పాకిస్థానీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. 1987లో ఆయనకు భారతరత్న ప్రకటించారు. అల్బేనియా దేశానికి చెందిన మదర్ థెరిసాకు 1980లో, దక్షిణాఫ్రికా దేశానికి చెందిన నెల్సన్ మండేలాను 1990లో భారతరత్న అవార్డుతో సత్కరించారు. ఇక 2019లో చివరిసారిగా, దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీను భారతరత్నతో సత్కరించారు. అదే ఏడాది సామాజిక రంగంలో సేవలు అందించినందుకు నానాజీ దేశ్‌ముఖ్, కళారంగంలో సేవలు అందించినందుకు డాక్టర్ భూపేన్ హజారికాకు వారి మరణానంతరం భారతరత్న అవార్డును అందుకున్నారు.
నేతాజీకి ప్రకటించిన అవార్డ్ వెనక్కి..
2014లో క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాసర్ సచిన్ టెండూల్కర్‌కు క్రీడా రంగం నుంచి తొలిసారిగా భారతరత్న అవార్డు లభించింది. 2013లో ఈ అవార్డుకు క్రీడా రంగాన్ని జోడించారు. ఇప్పటి వరకు 46 మంది ప్రముఖులు భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఇక ఈ పురస్కారం ప్రకటన 1977 జూలై 13 నుండి 1980 జనవరి 26 వరకు జనతా పార్టీ పాలనలో కొన్ని సంవత్సరాలు నిలిపివేశారు. అలాగే 1992లో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు అవార్డు ప్రకటించి.. తర్వాత చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనక్కు తీసుకున్నారు.
రాష్ట్రపతి వారెంట్ ప్రోటోకాల్..
అయితే భారతరత్న అవార్డు అందుకున్న వ్యక్తులు ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్, పతకాన్ని అందుకుంటారు. వీరికి నగదు లభించదు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారతరత్న గ్రహీతలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రభుత్వ శాఖల నుండి ఉచిత ప్రయాణ సౌకర్యాలు అందుతాయి. రాష్ట్రపతి వారెంట్ ప్రోటోకాల్ ప్రకారం, పార్లమెంటు ఉభయసభలలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత తర్వాత స్థానం కల్పిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout