కరోనా సెకండ్ వేవ్ అంతం ఎప్పుడంటే...
- IndiaGlitz, [Thursday,May 20 2021]
కరోనా మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించి దాదాపు ఏడాది పాటు పట్టి పీడించింది. కరోనా మహమ్మారి ఇక అంతమైనట్టే అనుకుంటున్న తరుణంలో సెకండ్ వేవ్ ప్రారంభమై.. తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెంది.. రోజుకు వేల మందిని పొట్టనబెట్టుకుంటోంది. ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో కుటుంబాలను కుటుంబాలనే ఇబ్బంది పెడుతోంది. ప్రజలు భయంతో వణికి పోతున్నారు. మానవ సంబంధాల మాట దేవుడెగురు.. ఒక మనిషి మరొకరితో నేరుగా మాట్లాడేందుకు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ సెకండ్ వేవ్‌కు అంతం ఎప్పుడు?
దీనికి కేంద్రం నియమించిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం సమాధానం చెబుతోంది. వచ్చే జూలై నాటికి సెకండ్ వేవ్ ఉధృతి తగ్గిపోతుందని శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. అయితే థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ కూడా ఉంటుందని వార్తలొస్తున్నాయి. మరి థర్డ్ వేవ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానికి ఆ తర్వాత థర్డ్ వేవ్ మొదలయ్యేందుకు 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని కేంద్రం నియమించిన ముగ్గురు సభ్యుల శాస్త్రవేత్తల బృందం అంచనా వేసింది. చేస్తున్న పరీక్షలు, నమోదవుతున్న కేసుల సరళిని బట్టి శాస్త్రవేత్తలు ఈ అంచనాలను రూపొందించారు.
ఈ క్రమంలో.. మే నెల చివరి వారం నుంచే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని.. రోజువారీ కేసులు 1.5 లక్షలకు తగ్గుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. జూన్ చివరి నాటికి 20 వేల స్థాయిలో కేసులు నమోదవుతాయని అంచనా వేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు కేసుల నమోదులో పతాకస్థాయిని చూసేశాయని ఈ బృందంలోని శాస్త్రవేత్త ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ తెలిపారు. మే నెల ఆఖరు నాటికి మిగిలిన రాష్ట్రాలు కూడా పతాకస్థాయిని చేరుకుంటాయని అంచనా వేశారు. ఆ తర్వాత 6-8 నెలల్లో థర్డ్ వేవ్ ఉంటుందని, అప్పటికి దేశంలో అధిక శాతం వ్యాక్సినేషన్ పూర్తయి ఉంటుంది కాబట్టి.. దాని ప్రభావం సెకండ్ వేవ్ స్థాయిలో ఉండకపోవచ్చని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.