మరో షాక్ ఇచ్చిన వాట్సాప్.. గూగుల్ సెర్చ్‌లో వెబ్ యూజర్ల నంబర్లు!

  • IndiaGlitz, [Saturday,January 16 2021]

ఇప్పటికే వాట్సాప్ ప్రైవసీ పాలసీతో పెను దుమారానికి తెరదీసిన వాట్సాప్.. మరో ఉల్లంఘనకు పాల్పడి అంతకు మించిన దుమారాన్ని రేపింది. వాట్సాప్ వెబ్ యూజర్ల పర్సనల్ నంబర్లు గూగుల్ సెర్చ్‌లో ఇండెక్సింగ్ ద్వారా కనిపించడం షాక్‌కు గురి చేస్తోంది. కామన్‌గా కంప్యూటర్ బేస్డ్ వర్క్ చేసే వారంతా ఇన్‌స్టాంట్ చాట్‌ కోసం డెస్క్‌టాప్, పీసీలను ఉపయోగిస్తుంటారు. వాట్సాప్ వెబ్ యూజర్ల వ్యక్తిగత ఇండెక్సింగ్ నంబర్లన్నీ గూగుల్ సెర్చ్‌‌లో దర్శనమివ్వడం కలకలం రేపుతోంది.

ఇండిపెండెంట్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు రాజశేఖర్ రాజహరియా శుక్రవారం.. గూగుల్ సెర్చ్‌లో కనిపించిన వాట్సాప్ వెబ్ యూజర్ల వ్యక్తిగత ఇండెక్సింగ్ నంబర్లను షేర్ చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. అయితే ఈ లీకైన ఇండెక్సింగ్ నంబర్లన్నీ బిజినెస్ నంబర్లు కావని.. వ్యక్తిగతమైనవని రాజహరియా తెలిపారు. ఎవరైనా వెబ్ వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు గూగుల్ సెర్చ్‌లో మొబైల్ నంబర్లు ఇండెక్స్ అవుతాయి. అయితే గతవారం కూడా వాట్సాప్‌కు సంబంధించిన వ్యవహారం ఒకటి బయటపడింది.

గతవారం ప్రైవేటు గ్రూప్ చాట్ లింక్స్ గూగుల్ సెర్చ్‌లో కనిపించి కలకలం రేపాయి. దీంతో వెంటనే స్పందించిన వాట్సాప్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఇలాంటి చాట్‌లను ఇండెక్స్ చేయవద్దని గూగుల్‌ను కోరినట్టు తెలిపింది. ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ చాట్స్ ఆహ్వాన లింకులను గూగుల్ ఇండెక్స్ చేసింది. ఈ ఇండెక్స్ వాట్సాప్ గ్రూప్ చాట్స్ లింకులను ప్రస్తుతానికి గూగుల్ తొలగించింది. అయితే, వాట్సాప్ చెప్పినప్పటికీ గూగుల్ ఇంకా ఇండెక్స్ చేస్తూనే ఉందని రాజహరియా తెలిపారు. కాగా.. ఇప్పటి వరకూ ప్రైవసీకి పెద్దపీట వేస్తూ వచ్చిన వాట్సాప్.. తాజాగా ఉల్లంఘనల మీద ఉల్లంఘనలకు పాల్పడుతుండటం యూజర్లను కలవర పెడుతోంది.