టీటీడీలో అసలేం జరుగుతోంది.. ఏంటీ చిల్లర చేష్టలు!
- IndiaGlitz, [Monday,February 04 2019]
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకన్న సన్నిధి ఇప్పుడు దొంగలమయమైంది. అసలు ఎవరిలా చేస్తున్నారు..? సెక్యూరిటీని దాటుకుని దొంగతనం చేసేంత ధైర్యం ఎవరికుంది..? ఈ దొంగతనం బయటి నుంచి వచ్చిన వాళ్లు చేశారా..? లేకుంటే అధికారుల్లో కొందరు మూడో కంటికి తెలియకుండా ఇలాంటి పనులు చేస్తున్నారా..? ఎందుకిలా చేస్తున్నారో అంతు చిక్కని పరిస్థితి. మొన్నటి వరకు పింక్ డైమండ్ వ్యవహారం, ఆ తర్వాత రమణ దీక్షితులు, తాజాగా కిరిటీల దొంగతనం మున్ముంథు ఇంకెన్నో.
నిత్యం లక్షలాది వెళ్లే తిరుమల కొండపై ఇలా జరగడం అపశకునమే. ప్రతిరోజూ ఇంత మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. భక్తుల రద్దీ ఇలా ఉంది అని వార్తల్లోకెక్కే టీటీడీ ఈ మధ్య అస్తమాను చిల్లర చేష్టలు చోటుచేసుకున్నాయనే వార్తల్లో నిలుస్తోంది. శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలోని మూడు కిరీటాలు మాయమైన ఉదంతం వెలుగు చూసిన వైనం. ఈ కిరిటీల విలువ సుమారు 50 లక్షలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉన్నట్టుండి ఇలా జరగడంతో ఒక్కసారి టీటీడీ అధికారులు, సిబ్బంది కంగుతిన్నారు. అసలేం జరుగుతోందో తెలియక టీటీడీ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఇంత జరుగుతున్నా ఏం నిద్రపోతున్నారు..?
వరుస దొంగతనాలు జరుగుతుంటే సెక్యూరిటీ ఏం నిద్రపోతోందా..? సీసీ కెమెరాలు పనిచేయవా..? అసలు ఈ వ్యవహారం మొత్తం ఇంటిదొంగలే చేస్తున్నారా అన్నది తెలియరాలేదు. అసలేం జరిగిందో తేల్చడానికి రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీమ్ ఏం తేల్చబోతోందో వేచి చూడాలి.
సీసీ కెమెరాలున్నాయ్ కానీ ఏం లాభం..!?
కిరిటాల మిస్సింగ్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు వేగంగా జరుగుతోందని టీటీడీ ఈవో సింఘాల్ తెలిపారు. సీసీ కెమెరాలు అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కెమెరాలు పనిచేస్తే ఈ దొంగతనం జరిగి రెండ్రోజులు కావస్తున్నా ఎందుకింత ఆలస్యం..? కెమెరాలు పేరుకు మాత్రమే ఉన్నాయా..? లేకుంటే పనిచేసే కెమెరాలేనా..? అని సామాన్య భక్తులు టీటీడీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెన్నాళ్లీ దొంగతనాలు.. చిల్లర చేష్టలు..?. మరోవైపు కామాంధులైన ఆఫీసర్లు ఇష్టారీత్యా రెచ్చిపోతున్నారు. విధులకు అని వచ్చిన ఖాకీల వ్యవహారం ఇప్పటికే వెలుగులోకి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా అసలు టీటీడీ చైర్మన్, ఈవో, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు..? ఒకట్రెండు సార్లు అనుకుంటే ఓకే మరీ ఈ రేంజ్‌లో ఉంటే.. ఇంటి దొంగలే ఈ పనులు చేస్తున్నారని అనుకోవాలా..? లేకుంటే ఇంకెవరైనా బయట్నుంచి వస్తున్నారా అనేది తేలాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.