నేను ఏ జోనర్ లో సినిమా చేసినా సంసార పక్షంగా - సెన్సార్ పక్షంగా ఉంటుంది - డైరెక్టర్ ఇంద్రగంటిమోహనకృష్ణ
- IndiaGlitz, [Tuesday,June 21 2016]
గ్రహణం, అష్టాచమ్మా, అంతకు ముందు ఆతర్వాత, గోల్కండ హైస్కూల్...ఇలా విభిన్న కథా చిత్రాలను అందించిన ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన తాజా చిత్రం జెంటిల్ మన్. నాని, నివేథ థామస్, సురభి హీరో, హీరోయిన్లుగా నటించిన జెంటిల్ మన్ చిత్రం ఇటీవల రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో జెంటిల్ మన్ చిత్రం ఇంద్రగంటి మోహనకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సందర్భంగా జెంటిల్ మన్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణతో ఇంటర్ వ్యూ మీకోసం....
జెంటిల్ మన్ చాలా ఇంట్రస్టింగ్ గా, సస్పెన్స్ గా ఉంది. స్ర్కీన్ ప్లే రాసేటప్పుడు ఏమనిపించింది..?
ఆర్ డేవిడ్ నాథన్ రాసిన కథను నేను తెరకెక్కించాను. అయితే ఈ కథలో ఉన్న అంశాలను మన నేటివిటీకి దగ్గరగా ఉండేలా మార్చాను. నాకు లాస్ట్ 10 నిమిషాలు ఒక ఛాలెంజ్ లా అనిపించింది. ఎప్పుడూ కూడా సినిమాలో ఆఖరి పది నిమిషాల్లో తెలియని విషయాలు చూపించాలి. అందుచేత లాస్ట్ పది నిమిషాలు ఎలా ఉండాలని బాగా ఆలోచించాను. కన్ ఫ్యూజన్ ఉండకూడదు చూడగానే అర్ధం అయిపోవాలి.దీని కోసం బాగా ఆలోచించి టైమ్ తీసుకుని రాసాను. నేను మల్టీప్లెక్స్ లోను, సింగిల్ స్ర్కీన్స్ లోను ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూసాను. ఎండ్ టైటిల్స్ పడేవరకు చూసి వెళుతున్నారు. సో...వెరీ హ్యాపీ.
కొంత మంది లాస్ట్ పది నిమిషాలు డల్ గా ఉంది అని అంటున్నారు... మీరేమంటారు..?
కొంత మంది లాస్ట్ పది నిమిషాలు డల్ గా ఉంది అంటున్నారు అని మీరు చెబుతున్నారు. మరి కొంతమంది అయితే...ఫస్టాఫ్ కథ లేదు అంటున్నారు. కానీ...ఈ సినిమాలో సరిగ్గా చూస్తే ఫస్ట్ సీన్ టు లాస్ట్ సీన్ వరకు లింక్ ఉంటుంది. అలాగే వీలైనంత వరకు ఇంట్రస్టింగ్ గా ఉండాలి...చప్పగా ఉండకూడదు అని ట్రై చేసాను. మీరన్నట్టు డల్ ఉండివుంటే...ఆడియన్స్ రియాక్షన్ వేరేలా ఉండేది...(నవ్వుతూ...)
జెంటిల్ మన్ జస్టిఫికేషన్ ఏమిటి..?
ఎవరైతే విలన్ అనుకున్నారో అతను విలన్ కాదు జెంటిల్ మన్. అందుచేత జెంటిల్ మన్ అనే టైటిల్ పెట్టాను. నాకు తెలుగు టైటిల్ పెట్టడం అంటేనే ఇష్టం. తెలుగులో టైటిల్ పెట్టాలంటే మంచివాడు, ఉత్తముడు అని పెట్టాలేమో...ఉత్తమ విలన్ కరెక్ట్ టైటిల్ అనిపిస్తుంది (నవ్వుతూ..)
మీరు డిఫరెంట్ సెన్సిబుల్ మూవీస్ చేస్తుండటానికి కారణం..?
డిఫరెంట్ అనను కానీ...కథ, కథాంశాలను బట్టి సీన్స్ ఉండాలి అనుకుంటాను. గ్రహణం సీరియస్ గా ఉంటుంది. మాయాబజార్ ఫాంటసీ ఫిల్మ్. గోల్కండ హైస్కూల్ డిఫరెంట్ సబ్జెక్ట్. నా సినిమాల్లో నా ఇష్టాలు కనిపిస్తాయి. అయితే...నేను ఏ జోనర్ లో సినిమా చేసినా సంసార పక్షంగా.. సెన్సార్ పక్షంగా ఉంటుంది.
ఈ కథ అనుకున్నప్పుడే నాని అనుకున్నారా..? లేక వేరే హీరో అనుకున్నారా..?
ఫస్ట్ నానితో అనుకున్నాను. అయితే నానికి ఈ కథ చెప్పినప్పుడు ఎవడే సుబ్రమణ్యం చేస్తున్నాడు. డిసెంబర్ వరకు ఆగాలి నాకోసం వెయిట్ చేస్తానంటే చేయండి. ఈలోపు ఓ చిన్న సినిమా ఏమైనా చేయండి అని కూడా చెప్పాడు. నాకు ఏం చేయాలా అని కన్ ఫ్యూజన్. శర్వానంద్ కి కథ చెప్పాను. కథ నచ్చింది కానీ ఎక్స్ ప్రెస్ రాజా బిజీలో ఉండడం వలన కుదరలేదు. ఆఖరికి నానితోనే చేసాను.
హీరోయిన్స్ నివేథ థామస్, సురభి వీళ్లిద్దరి ఎంపిక ఎలా జరిగింది..?
ఫస్ట్ కీర్తి సురేష్, నిత్యా మీనన్ అయితే బాగుంటుంది అనుకున్నాం కుదరలేదు. పాపనాశం లో నివేథా థామస్ కమల్ హాసన్ కూతురుగా నటించింది. అలాగే తమిళ్ చిత్రాల్లో కూడా నటించింది. మా కో డైరెక్టర్ నివేథ థామస్ తమిళ్ ఇంటర్ వ్యూ చూసి ఆమె అయితే బాగుంటుంది అని చెప్పారు నాకు కూడా క్యారెక్టర్ కి కరెక్ట్ గా సరిపోతుంది అనిపించడంతో ఆమెని ఫైనల్ చేసాం. ఇక సురభి విషయానికి వస్తే...ఒకరోజు నాని సురభి తెలుగులో బీరువాలోనటించింది అని ఫోటో పంపించాడు. ఫోటో చూడగానే కరెక్ట్ గా సెట్ అవుతుంది అనిపించింది. ఈ విధంగా ఈ ఇద్దరిని ఎంపిక చేసాం. వీళ్లిద్దరూ పాత్రలకు తగ్గట్టు అద్భుతంగా నటించారు. నివేథా స్టైల్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది.
జెంటిల్ మన్ కి మీరు అందుకున్న కాంప్లిమెంట్స్ ఏమిటి..?
స్ర్కీన్ ప్లే చాలా బాగుంది అంటున్నారు. అలాగే నాని - నివేథ కు బాగా నటించారు అంటున్నారు. అలాగే మణిశర్మ సంగీతానికి తీవ్రమైన పేరు వచ్చింది. బ్యాక్ గ్రౌండ్ స్కోరు కొత్తగా ఉండేందుకు చాలా కష్టపడ్డారు. ఓ అరవై, డబ్బై ట్రాక్స్ ఇచ్చారు. ఒక రకమైన పట్టుదలతో ఈ సినిమా చేసారు. అన్నీ బాగా కుదిరాయి అందుకే ఇంత మంచి విజయాన్ని సాధించింది. ఇక్కడో విషయం చెప్పాలి...వెన్నెల కిషోర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేసాను. వెన్నెల కిషోర్ పై చిత్రీకరించిన రెండు సీన్స్ ని ఎడిటింగ్ లో తీసేసాం. కానీ డివిడిలో ఆ రెండు సీన్స్ ని పెట్టి రిలీజ్ చేయాలనుకుంటున్నాను.
అవసరాల శ్రీనివాస్ ని నెగిటివ్ రోల్ లో చూపించడానికి కారణం..?
ఊహలు గుసగుసలాడే చిత్రంలో శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ లో కొంచెం నెగిటివ్ షేడ్ ఉంటుంది. నాకు తెలిసి శ్రీనివాస్ అవసరాలకు సైకో విలన్ క్యారెక్టర్ బాగా సూట్ అవుతుంది అనుకుంటున్నాను. అష్టా చమ్మ తర్వాత నానితో చేస్తున్న సినిమా కాబట్టి నాని, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ బాగుంటుంది అని ఈ క్యారెక్టర్ చేయించడం జరిగింది.
ఈ కథతో సినిమా చేయడం రిస్క్ అని అనిపించలేదా..?
ఎందుకు అనిపించలేదండి..అనిపించింది. ఒకటి కాదు చాలా రిస్క్ లు ఉన్నాయి. బందిపోటు ఫెయిల్యూర్ తర్వాత ఈ సినిమా చేయడం అనేది కత్తిమీద సాము లాంటిది. అలాగే కృష్ణ గాడి వీర ప్రేమ గాథ తర్వాత నాని ఈ కథను ఎంచుకోవడం రిస్క్. అలాగే ఎక్కువ బడ్జెట్ తో ఈసినిమా చేయడం మరో రిస్క్. అలాగే నిర్మాత కృష్ణ ప్రసాద్ గారు చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమాకు ఈకథ ఎంచుకోవడం కూడా రిస్కే. ఫైనల్ గా మంచి హిట్ అయ్యింది హ్యాఫీ గా ఉంది.
జెంటిల్ మన్ కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ సాధించింది. మీకు వస్తున్న రిపోర్ట్స్ ఏమిటి..?
మండే అసలు రిపోర్ట్ తెలుస్తుంది అంటారు కదా...మండే కూడా ఫుల్ అయ్యిందని తెలిసింది. సో.. మండే టెస్ట్ పాసయ్యింది. అలాగే యు.ఎస్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. నా కెరీర్ లో బిగ్గెస్ట్ గా నిలిచింది. నాకు ఎక్కువ ఆనందం కలిగించే విషయం ఏమిటంటే...నా ఫస్ట్ హిట్ నాని హీరోగా నటించిన అష్టా చమ్మాతో వచ్చింది. అలాగే కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కూడా నాని సినిమాతోనే వచ్చింది.
పెద్ద హీరోలతో సినిమాలు చేయకపోవడానికి కారణం..?
పెద్ద హీరోలకు తగ్గట్టు కథలు రాయాలంటే నాకు భయం. ఎందుకంటే వాళ్ల ఫ్యాన్స్ ని, ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కథ రాయాలి. ఎప్పుడైనా పెద్ద హీరో ఇమేజ్ కు, నా ఆలోచనలకు తగ్గట్టుగా కథ కుదిరితే తప్పకుండా చేస్తాను.
డైరెక్టర్ గా మీ టార్గెట్ ఏమిటి..?
అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించేలా ఓ సినిమా చేయాలి. నాకు షేక్సపియర్ నాటకం అంటే ఇష్టం. రొమాన్స్, కామెడీ ఉండేలా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలి. అలాగే కుటుంబరావు నవలు, బుచ్చిబాబు రాసిన చివరకు మిగిలేది నవల రైట్స్ తీసుకున్నాను. వాటిని సినిమాగా తీయాలనుకుంటున్నాను.