వెనక్కి తగ్గిన వాట్సాప్.. కొత్త ప్రైవసీ పాలసీ విధానం వాయిదా..
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్త ప్రైవసీ పాలసీపై ప్రఖ్యాత మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెనక్కి తగ్గింది. మూడు నెలల పాటు దీనిని వాయిదా వేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. తమ నూతన ప్రైవసీ పాలసీని ఫిబ్రవరి 8 లోపు యూజర్ల ఖాతాను తొలగిస్తామని వాట్సాప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాదు.. చాలా మంది వినియోగదారులు తమ వాట్సాప్ ఖాతాను తొలగించి ఇతర మెసేజింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం ప్రారంభించాయి. ప్రస్తుతానికి వాట్సాప్ వివరణ ఇచ్చుకున్నా వినియోగదారులైతే విని పరిస్థితి లేదు. దీంతో వాట్సాప్ సంస్థ తమ ప్రైవసీ పాలసీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. మరో మూడు నెలల పాటు గడువు తీసుకుని ఈ లోగా ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు యత్నిస్తామని వెల్లడించింది.
తన వినియోగదారులకు వివరణల మీద వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చి వినియోగదారులను గందరగోళంలోకి నెట్టివేసిన ఈ సంస్థ పరిస్థితి చేజారుతోందని తెలియడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. కొత్త ప్రైవసీ పాలసీని తీసుకురావడంతో దీనిని అంగీకరించలేక చాలా మంది వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాడుతున్నారు. దీంతో వాట్సాప్ మరోమారు తన కొత్త ప్రైవసీ పాలసీపై స్పందించింది. కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం వాట్సాప్ తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో డేటా షేర్ చేసుకుంటుందని యూజర్లు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై వాట్సాప్ నేడు క్లారిటీ ఇచ్చింది.
కొత్త అప్‌డేట్ల వల్ల ప్రజల మెసేజ్‌ల విషయంలో గోప్యతపై ఎలాంటి ప్రభావం పడబోదని వాట్సాప్ స్పష్టం చేసింది. బిజినెస్ మెసేజింగ్‌కి సంబంధించి కీలక మార్పులతో పాటు తాజా అప్‌డేట్‌లో డేటా సేకరణ, వినియోగంపై మరింత పారదర్శకత వస్తుందని వెల్లడించింది.
కాల్స్‌ని వినడంగానీ, మెసేజ్‌లు చదవడంగానీ తాము చేయబోమనీ.. కాల్స్ లాగ్‌ని కూడా తమ వద్ద ఉంచుకోబోమని స్పష్టం చేసింది. అలాగే.. తాముగానీ, ఫేస్‌బుక్‌గానీ యూజర్లు షేర్ చేసుకున్న లొకేషన్ చూడబోమని వెల్లడించింది. కాంటాక్ట్‌లను కూడా ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోమనీ.. సందేశాలను కనిపించకుండా సెట్ చేసుకోవచ్చని వాట్సాప్ వివరించింది.
వినియోగదారులు ఏది షేర్ చేసుకున్నా వారి మధ్యే ఉంటుందని.. వారి సందేశాలన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్‌తో భద్రపరచబడతాయని తెలిపింది. వినియోగదారుల భద్రతను తాము ఎప్పటికీ దెబ్బతీయబోమని వాట్సాప్ స్పష్టం చేసింది. ప్రతి చాట్‌కి లేబుల్ వేయడాన్ని గమనించడం ద్వారా తమ చిత్తశుద్ధిని తెలుసుకోవచ్చని తెలిపింది. గ్రూప్‌లు ఎప్పటికీ ప్రైవేట్‌గానే ఉంటాయనీ.. గ్రూపుల్లోని సమాచారాన్ని ప్రకటన కోసం ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోవడం జరగదని స్పష్టం చేసింది. యూజర్లు తమ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని కూడా వాట్సాప్ పేర్కొంది. అయితే వాట్సాప్ అసలు ఏ సమాచారాన్ని సేకరిస్తుందనేది మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో యూజర్లు వాట్సాప్ ఇస్తున్న వివరణలను పట్టించుకునే స్థితిలో లేరు. దీంతో తన ప్రైవసీ పాలసీని వాట్సాప్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout