TDP:టీడీపీ వస్తే మన పరిస్థితేంటి..? వైసీపీ నేతల్లో కలవరం ఎందుకు మొదలైంది..?
Send us your feedback to audioarticles@vaarta.com
వైనాట్ 175.. ఇది కొన్ని నెలలుగా సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతల నినాదం. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు 175 తామే గెలుస్తామని హోరెత్తిస్తు్న్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు అసలు ఒక్క సీటు కూడా రాదనే ధీమాతో ఉన్నారు. కానీ జనసేన-టీడీపీ పొత్తుతో కొంత మంది వైసీపీ నేతల్లో కలవరం మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న నేతలు భవిష్యత్‌పై కలవరపాటుకు గురవుతున్నారనే సంకేతాలు మొదలయ్యాయి. ఓవైపు పార్టీ అధినేత జగన్.. వచ్చే సారి కూడా మనదే అధికారం అని ధీమాగా చెబుతుంటే.. మరోవైపు సీనియర్ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తు్న్నారు.
విభేదాలు పక్కనబెట్టి వైసీపీని గెలిపించుకుందాం.. లేదంటే..?
తాజాగా ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో ఎలాంటి భయం ఉందో అర్థమవుతోంది. శుక్రవారం వై ఏపీ నీడ్స్ జగన్(ఏపీకి జగన్ ఎందుకు కావాలి) అనే అంశంపై పార్టీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు, సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, ముఖ్యనాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే మన పరిస్థితి ఏమిటి? భవిష్యత్తు ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ నాయకుల తాట తీస్తామంటూ జనసేన, టీడీపీ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ కానీ నిజంగానే అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాలని సూచించారు. అందుకే విభేదాలు పక్కనబెట్టి కలిసికట్టుగా వైసీపీ గెలుపు కోసం పనిచేయాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న 90 శాతం వాలంటీర్లు వైసీపీ మద్దతుదారులేనని.. ఎన్నికల సమయంలో నేతలు వారిని కలుపుకొని వెళ్తే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం బాలినేని వ్యాఖ్యలు వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
భవిష్యత్‌పై వైసీపీ నేతలు బెంగపడుతున్నారా..?
అలాగే తనను మంత్రి పదవి నుంచి తొలగించారనే బాధ ఇప్పటికీ ఉందనడం కొసమెరుపు. మంత్రివర్గ విస్తరణలో సొంత బంధువైన బాలినేనిని మంత్రి పదవి నుంచి తొలగించిన జగన్.. ప్రకాశం జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేష్‌ను మాత్ర కొనసాగించారు. దీంతో బాలినేని తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అప్పటి నుంచి పార్టీలో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలినేనిపై అవినీతి ఆరోపణలు రావడం, ఆయనపై అధిష్టానానికి కొందరు నేతలు ఫిర్యాదుచేయడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో బాలినేని పార్టీ మారతారనే ప్రచారం జోరందుకుంది. వెంటనే మీడియా సమావేశం పెట్టి ఈ ఆరోపణలకు చెక్ పెట్టారు. అయితే ఆ సమావేశంలో బాలినేని కంటతడి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటని వ్యాఖ్యానించడం చూస్తుంటే పైకి గాంభీర్యంగా కనిపిస్తున్న లోలోపల వైసీపీ నేతలు భవిష్యత్‌పై ఎలా బెంగపడుతున్నారో అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగుదేశం అంటే ఎందుకంత మోజు.. టీడీపీ వైపు ఎందుకు చూస్తున్నారు..?
ఇదిలా ఉంటే ఇటీవల శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలకు కూడా ఇందుకు ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. జిల్లాలోని పెద్దగనగళ్లవానిపేటలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు ప్రారంభోత్సవం సందర్భంగా మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మీకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా.. తెలుగుదేశం పార్టీ అంటే మీకు ఎందుకంత మోజు? అని ప్రశ్నించారు. టీడీపీ పని అయిపోయిందని అలాంటి పార్టీని నమ్మకండని సూచించారు. దీంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రజలు టీడీపీ వైపు ఎందుకు చూస్తున్నారనే అసహనంతో ధర్మాన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.
పైకి గాంభీర్యంగా ఉన్నా.. లోలోపల భయాందోళనలో ఉన్నారా..?
వైసీపీలో ఎంతో సీనియర్ నేతలైన బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన ప్రసాదరావు లాంటి నేతలే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై క్యాడర్లో ఆందోళన నెలకొంది. నాయకులే ఇలా మాట్లాడితే ఇక మా పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరే కాదు చాలా మంది వైసీపీ నేతల్లో కూడా ఇలాంటి భయాందోళనలే ఉన్నా.. పైకి మాత్రం గాంభీర్యంగా ఉంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబును ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడంతో ప్రజల్లో టీడీపీ పట్ల సానుభూతి వచ్చిందని.. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైనట్లు చెబుతున్నారు.
టీడీపీ-జనసేన పొత్తుతో ఓటమి భయం పట్టుకుందా..?
గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ఉన్నా కూడా జనసేన-టీడీపీ విడివిడిగా పోటీ చేయడంతో దాదాపు 45-50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం 1000 ఓట్ల లోపు మెజార్టీతో గెలిచారు. ఈసారి ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనుండడం.. ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో చాలా మంది వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందని వెల్లడిస్తున్నారు. మొత్తానికి ఈసారి ఎన్నికలు మాత్రం కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తాయని.. గెలిచిన వారు అందలం ఎక్కడం.. ఓడిన వారు పాతాళానికి పడిపోవడం ఖాయమని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com