ఏం విజయసాయి.. మీ అనుమతి తీసుకోవాలా..!?
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పవన్, మాజీ జేడీ పై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు కౌంటర్‌గా శుక్రవారం భీమవరం శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సభలో మాట్లాడుతూ.. "విశాఖ నుంచి జేడీని నిలబెడితే విజయసాయిరెడ్డి ఎందుకు నిలబెట్టారు అంటారు. మా అభ్యర్ధుల్ని నిలబెట్టేందుకు మీ అనుమతి తీసుకోవాలా.? చంద్రబాబు అనుమతి తీసుకోవాలా.? అతి తగ్గించండి. మేము మాకు ఇష్టం వచ్చిన వారిని నిలబెడతాం. విశాఖలో వైసీపీ తాట తీసేవాడిని నిలబెట్టాం. కేసీఆర్ జనసేనకి ఒక్క శాతం ఓటింగ్ ఉందన్నారు.. ఇప్పుడు అది 42 శాతం అయ్యింది.. కాబట్టే 130 మంది అభ్యర్ధుల్ని ఏపీకి నిలబెట్టాం. ఒకటి రెండు మినహా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకి నిలబెట్టాం. తెలంగాణలో జనసేన పార్టీ తరుపున ఐదుగుర్ని, బీఎస్పీ తరుపున నలుగుర్ని బరిలోకి దించాం. కేసీఆర్ గారు తెలంగాణలో జనసేనకి బలం లేదు అంటే, అదే తెలంగాణ నడిబొడ్డున నిలబడి నా బలం చూపాలని ఉంది.
నేను తెలుగు ప్రజల ఐక్యత కోరుకున్నా, ప్రజల్ని విడదీసి పాలించడం ఇష్టం లేదు.. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చారు.. 2014లో ఏ టిక్కెట్ పెట్టుకుని గెలిచారు. ఎవరు వస్తే గెలిచారు అన్న విషయాన్ని మరిచారు. నా ముందు కేసీఆర్ గారిని తిట్టిన వ్యక్తి. ఆంధ్రుల్ని తిట్టిన వ్యక్తి ఏ ముఖం పెట్టుకుని భీమవరం వచ్చి అడుగుతారు. వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌కి పౌరుషం లేదేమోగాని, మా ఆంధ్ర ప్రజలకి గౌరవం ఉంది. దయచేసి విభజన రాజకీయాలు మానండి. పోటీ చేయాలి అంటే టిఆర్ఎస్‌ని ఇక్కడ నిలబెట్టండి. ఒకప్పుడు ఛీ కొట్టిన జగన్‌కి మద్దతు ఇవ్వడం ఎందుకు.? అడ్డగోలుగా అడ్డదారిలో వచ్చి రాజకీయాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం" అని పవన్ హెచ్చరించారు.
ఇక్కడ రాజకీయం చేయొచ్చా..?
"ఆంధ్రులు తెలంగాణలో వచ్చి రాజకీయాలు చేయరాదు గానీ, తెలంగాణ వారు వచ్చి ఆంధ్రలో రాజకీయం చేయొచ్చా? నరసాపురం పార్లమెంటు అభ్యర్ధిగా శ్రీ నాగేంద్రబాబు గారిని నిలబెడుతున్నాం. ఎంతో గౌరవం, మేధస్సు ఉన్న వ్యక్తి విష్ణురాజు గారిని పోటీ చేయమని అడిగాను. రాజకీయాలు ఇష్టం లేదు అన్నారు. నేను అడగగానే అడ్వయిజరీ బోర్డులోకి వచ్చారు ఆయనకి ధన్యవాదాలు. ఈ రోజు రాజకీయాల్లో మాట్లాడగలుగుతున్నానంటే నాకు ప్రేరణ నాగబాబు గారే. ఆయన చెప్పిన మాటలు నాటుకుపోయాయి. పోటీ చేయమంటే ఆయనా భయపడ్డాడు. బి.ఫారం ఇస్తా. నాలుగు మంచి మాటలు మాట్లాడు. నువ్వేంటో పది మందికి తెలియాలి అని చెప్పా. గతంలో గంగరాజు గారిని గెలిపించాం. ఈసారి నాగబాబు గారిని గెలిపిద్దాం. మన గుర్తు గాజు గ్లాసు. సామాన్యుడి గుర్తు.. ఆ గుర్తు మీద మీట నొక్కేద్దాం" అని అభిమానులు, కార్యకర్తలకు పవన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout