జగన్ సీఎం పీఠం ఎక్కితే ఏమి న్యాయం చేస్తాడు!?
- IndiaGlitz, [Tuesday,April 09 2019]
2019 సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనవి, మార్పునకు నాంది పలికే ఎన్నికలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజమండ్రిలో బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ..వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయం అంటే చంద్రబాబు కుటుంబం, జగన్మోహన్ రెడ్డిగారి కుటుంబమే చేయాలా..? సామాన్యులు చేయకూడదా..?. ఎంతసేపు మేము మీకు పల్లకీలు మోస్తూ, ఉడిగం చేస్తూనే బతకాలా..?. అవినీతిపై విసుగొచ్చి, సామాన్యుడి బతికే రోజులు రావాలని రాజకీయాల్లోకి వచ్చాను తప్ప సరదాకు రాలేదు. 2003లో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాక నేర్చుకున్నాను, అవగాహన చేసుకున్నాను అని పవన్ చెప్పుకొచ్చారు.
తండ్రి శవం పూడ్చకముందే...
తండ్రి శవం పూడ్చకముందే ముఖ్యమంత్రి అవ్వాలనే దౌర్భాగ్య స్థితిలో లేను. తండ్రి శవం దొరక్కముందే ముఖ్యమంత్రి అవ్వాలనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు.? ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఎరవేసి కష్టార్జితాన్ని అంతా ఖర్చు అయిపోయాక వదిలేసే వ్యక్తిత్వం నాది కాదు. ఒక్కసారి మాట ఇచ్చానంటే తలతెగిపడే వరకు నిలబడి తీరుతాను. 2006లో జగన్మోహన్ రెడ్డి మేనమామ సినిమా చేయాలని బలవంతపెట్టారు. నాలాంటి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చాను. సామాన్యుడిని బతకనివ్వకపోతే నక్సలిజం, తిరుగుబాట్లు పుడతాయి. ప్రజలు ఆయుధం పడతారు. జనసేన పార్టీ ద్వారా ఓటు అనే ఆయుధంతో సమాజాన్ని మార్చడానికి వచ్చాను అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు.. ముఖ్యంగా వైఎస్ జగన్ ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే.