చంద్రబాబుపై పవన్ వ్యాఖ్యల మర్మం ఏంటి..? టీడీపీకి బైబై చెబుతారా..?
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల మండపేట, అరుకు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదని తెలిపారు. చంద్రబాబుకు ఉన్నట్టే తనకూ పార్టీ లీడర్ల నుంచి ఒత్తిడి ఉందని... అందుకే ప్రత్యేక పరిస్థితుల్లో రాజోలు, రాజానగరంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పవన్ వెల్లడించారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదని.. కానీ చేశారని తెలిపారు. అందుకు పార్టీ నేతలకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు.
సీట్ల సర్దుబాటు ఇబ్బందిగా ఉందేమో..?
టీడీపీ సీట్లు ప్రకటించడం పార్టీలోని కొందరు నేతలను ఆందోళనకు గురి చేసిందని చెప్పుకొచ్చారు. అలాగే ఇటీవల నారా లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడినా తాను పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మౌనంగా ఉంటున్నానని వ్యాఖ్యానించారు. సీనియర్ నేతగా.. ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అలా జరుగుతూ ఉంటాయన్నారు. పొత్తులు సీట్లు సర్దుబాటు అంటే వాళ్లకు ఇరుకు చొక్కా తొడుక్కున్నట్టు ఉంటుందన్నారు. వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఇప్పుడు పొత్తు ధర్మంపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
పవన్ ప్రకటన వెనక ఆంతర్యం ఏమిటి..?
ప్యాకేజ్‌లో ఏమైనా తేడా వచ్చిందా.. లేదంటే పవన్ కళ్యాణ్ వెనుక ఎవరైనా ఉండి నడిపస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ ప్రకటన వెనుక అంతర్యం ఏమిటి అనే దానిపై సర్వత్ర చర్చ జరుగుతుంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్.. బీజేపీతో కూడా కలిసి ప్రయాణం చేస్తామని చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే రోజున ఒక్కసారిగా బాంబు పేల్చారు. చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించలేదని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ వ్యవహారం నచ్చకపోయినా చాలా సహనంతో వ్యవహరిస్తున్నానని.. తనపై కూడా ఒత్తిడి ఉంటుందని చెప్పుకొచ్చారు.
టీడీపీ తీరుపై జనసైనికులు ఆగ్రహం..
అయితే కొన్ని రోజులుగా పొత్తులో టీడీపీ అనుసరిస్తున్న తీరు జనసేన క్యాడర్‌కు మింగుడు పడడం లేదు. జనసేన వల్ల టీడీపీకి లాభం అని మునిగిపోతున్న నావను మనం పైకి లేపుతున్నట్లుందని ముందునుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే క్యాడర్ గొంతు నొక్కి జనసేనాని ముందుకు పోతున్నారు. ఇదే సమయంలో టీడీపీతో పొత్తు ఇష్టం లేని వారు పార్టీని వీడి వెళ్లిపోవచ్చని హుకుం కూడా జారీ చేశారు. దీంతో క్యాడర్‌లో ఒకింత అసహనం వచ్చింది. తెలుగుదేశం జెండా మోయడానికి, బ్యానర్లు కట్టడానికి తాము ఉన్నామా అని కొంతమంది తిరగబడ్డారు. అంతేకాదు సంఖ్యాపరంగా పెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపులు కూడా కొంత జనసేనకు దూరమయ్యారు.
ఒంటరిగా పోటీచేయాలని సూచనలు..
ఇష్టం లేని వారు వేరే పార్టీకి వెళ్లిపోగా.. మరికొంతమంది సైలెంట్ అయిపోయారు. దీంతో జనసేనకు వచ్చిన హైప్ ఒక్కసారిగా తగ్గిపోతూ వచ్చింది. దీనికి తోడు లోకేష్ సీఎం పదవిపై చేసిన కామెంట్స్ అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబుపై పవన్ చేసిన వ్యాఖ్యలతో జనసేన క్యాడర్‌లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికైనా తమ నాయకుడు కళ్లు తెరిచాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన కోరిన సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేసి అమీతుమీ తేల్చుకోవాలని సూచిస్తున్నారు.
కమలంతో కలిసి వెళ్లే యోచనలో సేనాని..
అలాగే బీజేపీతో కలిసి బరిలో దిగే విధంగా అడుగులు వేద్దామని అధినేతకు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కొంతమంది ఫాస్టర్లతో సమావేశమైనపుడు బీజేపీతో వెళ్తే ఎలా ఉంటుందనే అంశం చర్చించనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అవసరమైతే టీడీపీతో తెగతెంపులు చేసుకుని కాషాయం పార్టీతో కలిసిపోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందన బట్టి జనసేన అడుగులు ఉండనున్నాయి. మొత్తానికి ఎన్నికల వేళ టీడీపీ-జనసేన పొత్తుకు తూట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com