పవన్ మౌనం వెనుక ఆంతర్యమేంటి.. అసలేం జరుగుతోంది!

  • IndiaGlitz, [Thursday,April 18 2019]

ఏపీలో ఏప్రిల్-11న ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం నేతల భవిష్యత్ ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఆ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లో మూడంచెల భద్రత మధ్య సేఫ్‌గా ఉన్నాయి. మే-23న ఆ ఈవీఎంల తెరిస్తే ఎవరి జాతకమేంటో తేలిపోనుంది. అయితే గెలిచేది మేమే.. కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుండగా.. టీడీపీ మాత్రం ఈవీఎంలలో తేడా జరిగిందని.. ఇవి అసలు ఎన్నికలే కావని ఈసీకి ఫిర్యాదు చేసి టీడీపీ అధిపతి చంద్రబాబు మొదలుకుని నేతలందరూ ప్రెస్‌మీట్లు పెట్టి దంచికొడుతున్నారు.

అయితే ఎన్నికల ప్రచారంలో కచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే.. వైసీపీ, టీడీపీని జనాలు పట్టించుకోలేదు.. నేనే సీఎం .. మాదే ఏపీ అన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎన్నికల తర్వాత ఇంత జరుగుతున్నా గానీ ఆ పార్టీకి చెందిన నేతలు గానీ ఎక్కడ రియాక్టవ్వకపోగా మౌనం పాటిస్తుండటంతో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. దీంతో అసలేం జరుగుతోందో తెలియక అటు మెగాభిమానులు.. ఇటు జనసేన కార్యకర్తలు ఆందోళనలో పడ్డారు. అంటే ఈవీఎంలపై గానీ.. ఎన్నికలు జరిగిన విధానంపైగానీ.. గొడవలపైగానీ పవన్‌కు ఎలాంటి సందేహాలు లేవన్న మాట.

పవన్‌ పై విమర్శల వర్షం..!

అంతేకాదు ఎన్నికలు ముగియగానే పవన్ కూడా హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే గాజువాక, భీమవరం, విజయవాడలో ఇలా మొత్తం మూడు ఇళ్లు.. ఏపీ వ్యాప్తంగా పార్టీ ఆఫీసులు ఉన్నప్పటికీ పవన్ మాత్రం హైదరాబాద్‌కు వచ్చేయడం.. ఏపీలో ఇంత హడావుడి.. వివాదాలు జరుగుతున్నా స్పందించకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా టీడీపీ వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు కానీ.. వైసీపీ వర్సెస్ జనసేన కార్యకర్తలు, అభిమానులుగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అంతేకాదు పవన్ సీన్ అయిపోయిందని మళ్లీ బ్యాక్ టూ మూవీస్ అంటూ నెటిజన్లు, వైసీపీ వీరాభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎన్నికలవ్వగానే హైదరాబాద్‌‌కు..

కాగా.. ఎన్నికలకు ముందు తెలంగాణను పాకిస్థాన్‌తో పోల్చడం, ఆంధ్రోళ్లను ఇక్కడ కొడుతున్నారని.. కేసీఆర్.. ఏపీ ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దని ఇలా పవన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడటంతో ఇక ఆయన హైదరాబాద్‌ మొహం చూడరని అందరూ భావించారు.. అభిమానులు సైతం ఇదే అనుకున్నారు. అయితే ఎన్నికలవ్వడం ఆలస్యం పవన్ మాత్రం తెలంగాణలోని ఇంట్లోకి వచ్చి వాలిపోయారు. దీంతో అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది. అయితే ఎవరెక్కడైనా ఉండొచ్చు.. డబ్బులుంటే నివాసం కట్టుకొని జీవించేయచ్చు అది ఇక్కడ అవాస్తవం.

కానీ ఏపీలో జరుగుతున్న హడావుడికి మాత్రం పవన్ స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఏపీలో జనసేన నిశ్శబ్ధ విప్లవం జరుగుతోందని.. ఈ ఎన్నికల్లో జనసేన విజయడంఖా మోగిస్తుందనే నేతలు మొదలుకుని అధినేత సైలెంట్‌గా ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మే-23 ఫలితాల రోజున వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల భవితవ్యమేంటో తేలిపోనుంది.. అప్పటి వరకూ వేచి చూడక తప్పదు మరి.