అటు ఈటల.. ఇటు షర్మిల తెలంగాణలో ఏం జరుగుతోంది?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకూ మారిపోతున్నాయి. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ వ్యతిరేక గాలులు బలంగా వీస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు టీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఉన్న పార్టీలతోనే తలబొప్పి కడుతుంటే.. రాష్ట్రంలో రెండు కొత్త పార్టీలు రాబోతున్నాయంటూ ప్రచారం. దీనిలో నిజమెంతుందో తెలియదు కానీ ప్రచార జోరు మాత్రం హోరుగానే ఉంది. తెలంగాణ ఆరోగ్యశాఖామంత్రి ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తుండగా.. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సైతం తెలంగాణలో కొత్త పార్టీ నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు నేడు ఆమె సమావేశం నిర్వహించబోతున్నారు.
కేసీఆర్ మాటలు బలాన్నిచ్చాయా?
మంత్రి ఈటల రాజేందర్ అధికార టీఆర్‌ఎస్ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా సీఎం కేసీఆర్ మాటలు ఈ ప్రచారానికి బలాన్నిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆదివారం నాటి సమావేశంలో కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీ కాదనే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఈటలను ఉద్దేశించే చేశారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో.. ‘మేం టీఆర్‌ఎస్ జెండా ఓనర్లం.. కిరాయిదారులం కాదు’ అని వ్యాఖ్యానించిన ఈటల.. ఈ మధ్య రైతుల ఆందోళన, ధాన్యం కొనుగోలు అంశాలపై ప్రభుత్వాన్ని కొంత ఇరుకునపెట్టేందుకు యత్నిస్తున్నారి పార్టీ ముఖ్యుల్లో వ్యక్తమైంది. ప్రస్తుతం ఈటల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తున్నారనే టాక్ బలంగానే వినబడుతోంది. అలాగే కేసీఆర్ స్థానంలో సీఎంగా కేటీఆర్ కంటే ఈటల అయితే బాగుంటుందని విపక్షాల వ్యాఖ్యానిస్తున్నాయి. టీఆర్‌ఎస్ నుంచి బయటికి వెళ్లి కొత్త పార్టీ పెట్టాలన్న ఉద్దేశం ఉండడం వల్లే మంత్రి ఈటల స్వరంలో మార్పు వచ్చిందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి.
బ్రదర్ అనిల్ పోస్ట్.. షర్మిల కొత్త పార్టీ గురించేనా?
మరోవైపు వైఎస్ షర్మిల సైతం రంగంలోకి దిగారు. తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ‘అదే చోట, అదే పార్టీలో ఉండకుండా సొంత ప్రయత్నం చేస్తాను’ అంటూ షర్మిల భర్త అనిల్ కుమార్ సైతం సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ఇందుకు అవసరమైన సన్నాహాలను సైతం నేటి(మంగళవారం) నుంచే ప్రారంభించనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. తొలుత ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు, వైఎస్పార్ అభిమానులకు సమాచారం అందించినట్టు సమాచారం. దీనికి మూడు వేల మంది కార్యకర్తలు, 100 మంది ముఖ్య నేతలు హాజరుకానున్నట్టు సమాచారం. తెలంగాణలోని అన్ని జిల్లాల నేతలతో రోజు విడిచి రోజు భేటీలు జరుగుతాయని తెలుస్తోంది. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.
ప్రధాన పార్టీలపై వ్యతిరేకత..
మొత్తం మీద రెండు కొత్త పార్టీలు రాబోతున్నాయనే ప్రచారమైతే జరుగుతోంది. అయితే ఒకవేళ ఇదే నిజమైతే ఆ కొత్త పార్టీలు రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇటు టీఆర్ఎస్ పార్టీపై రాష్ట్రంలో వ్యతిరేకత బాగానే ఉంది. బీజేపీ విషయానికి వస్తే పబ్లిక్ ప్రాపర్టీలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తుండటం పట్ల ప్రజల్లో తీవ్ర అసహనం వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలో బీజేపీని ఆదరించే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీలు వచ్చి.. ప్రజల పక్షాన నిలవగలిగితే దానికి తిరుగుండదనే భావన వ్యక్తమవుతోంది. అయితే కేసీఆర్ అన్నట్టు కొత్త పార్టీ పెట్టినంత ఈజీ కాదు.. దానిని నిలబెట్టుకోవడం. ఇప్పటి వరకూ ఎన్నో కొత్త పార్టీలొచ్చాయి. నిలబెట్టుకున్నవి మాత్రం చాలా తక్కువ. ఒక్కసారి నిలబెట్టుకుంటే మాత్రం తిరుగుండదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com