Agnipath protest : అసలేంటీ అగ్నిపథ్ స్కీమ్.. ఎందుకంత గొడవ, ఆరోపణలపై కేంద్రం ఏమంటోంది..?
Send us your feedback to audioarticles@vaarta.com
సైన్యం , సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తాజాగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. కొన్ని చోట్ల ఈ నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తంగా మారి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేస్తున్నారు. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనూ అగ్నిపథ్ ఆందోళనలు తీవ్ర రూపు దాల్చి ఏకంగా పోలీసులు కాల్పులు జరిపే వరకు విషయం వెళ్లింది. అసలేంటీ అగ్నిపథ్ స్కీమ్... దీనికి అర్హతలేంటీ, యువత ఆందోళనలు చేయడానికి కారణలేంటీ...? అనేది ఒకసారి చూస్తే.
రక్షణ శాఖ వివరాల ప్రకారం... సైన్యంలో యువతకు అవకాశం ఇచ్చేందుకు కేంద్రం ఈ పథకం తీసుకొచ్చింది. అగ్నిపథ్‌లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీరులు అంటారు. వీరు నాలుగేళ్ల పాటు సైన్యంలో పని చేయొచ్చు. ఆ తర్వాత వారి పనితీరును సమీక్షించి శాశ్వత ప్రాతిపదికన సైన్యంలోకి తీసుకుంటారు. మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని రిటెయిన్ చేస్తారు. అంటే ప్రతి 100 మందిలో 25 మందిని రెగ్యులరైజ్ చేస్తారు. వాళ్లు 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో విధులు నిర్వర్తించనున్నారు.
జీత భత్యాలు:
అగ్నిపథ్ కింద సైన్యంలో చేరేవారికి తొలి ఏడాది నెలకు 30 వేల రూపాయల వేతనం చెల్లిస్తారు. మినహాయింపులు పోగా.. ఇందులో చేతికి 21 వేలు వస్తాయి. మిగిలిన 9 వేల రూపాయలు అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమచేస్తారు. రెండో ఏడాది నెలకు 33 వేల రూపాయల వేతనం చెల్లిస్తారు. అందులో 30 శాతం అంటే 9,900 రూపాయలను అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. మూడో ఏడాదిలో వేతనంగా రూ.36,500లు చెల్లిస్తారు.. ఇందులో రూ. 10,980ని అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. నాలుగో ఏడాది నెలకు 40 వేలు వేతనం చెల్లిస్తారు. ఇందులో రూ. 12,000 కార్పస్ ఫండ్‌కి వెళ్తుంది.
ఇలా నాలుగేళ్లలో మొత్తం 5 లక్షల రెండు వేల రూపాయలు కార్పస్ ఫండ్‌లో జమ అవుతాయి. దీనికి మరో 5 లక్షల 2 వేల రూపాయలను కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీ కలిపి నాలుగేళ్ల తర్వాత 11 లక్షల 71 వేల రూపాయలను ఒక్కో అగ్నివీరుడికి చెల్లిస్తారు. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. దీనికి తోడు ఆర్మీ నిబంధనల ప్రకారం ఇతర రాయితీలు, సౌకర్యాలు ఉంటాయి. అంతేకాదు.. నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన వారికి సమగ్ర ఆర్థిక ప్యాకేజ్ ఉంటుంది.
ఎవరు అర్హులు?
దేశంలో 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో చేరేందుకు అర్హులు. పదో తరగతి లేదా ఇంటర్ పాసైన యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ప్రస్తుతం యువకులకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. అనంతరం అమ్మాయిలకు కూడా ఈ పథకాన్ని వర్తింపు జేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ అర్హతలను బట్టి ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలో పని చేయవచ్చు.
సైన్యంలో ఉండగా చనిపోతే..
సైన్యంలో ఉండగా మరణిస్తే.. ఒక్కో అగ్నివీరుడికి రూ. 48 లక్షల జీవిత బీమా ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ కోసం అభ్యర్థులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే.. రూ. 44 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అదనంగా చెల్లిస్తారు.
వైకల్యం సంభవిస్తే..
సైన్యంలో ఉండగా శారీరక వైకల్యం సంభవిస్తే పరిహారం అందించనుంది కేంద్రం. వైకల్యం 100 శాతం ఉంటే 44 లక్షలు, 75 శాతమైతే 25 లక్షలు, 50 శాతమైతే 15 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తారు.
అపోహలకు కేంద్రం క్లారిటీ:
అయితే.. దేశవ్యాప్తంగా యువత, సైనిక ఉద్యోగార్థులకు అగ్నిపథ్ స్కీమ్‌పై వున్న అపోహలను తొలగించేందుకు కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత వీరు వ్యాపార రంగంలో స్థిరపడాలనుకుంటే వారికి ఆర్ధిక సాయం అందించనునున్నారు. ఉన్నత విద్యను అభ్యసించాలంటే 12వ తరగతికి సమానమైన ధ్రువపత్రం చెల్లిస్తారు. ఉద్యోగాలు చేయాలనుకునేవారికి కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాల్లో ప్రాధాన్యత కల్పిస్తారు. అగ్నివీరులు నాలుగేళ్ల తర్వాత ఉగ్రవాదులుగా మారుతారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఇలా వ్యాఖ్యానించడం భారత సాయుధ బలగాల నైతికతను విలువలను అవమానించడమేనని అభిప్రాయపడింది. నాలుగు సంవత్సరాల పాటు మిలటరీ యూనిఫాం ధరించిన యువకులు జీవితాంతం దేశ శ్రేయస్సు కోసం కట్టుబడి వుంటారని కేంద్రం విశ్వసిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout