ఏఎన్-32 విమానం ఏమైంది.. ఆ 13 మంది సంగతేంటి..!?
Send us your feedback to audioarticles@vaarta.com
భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం గల్లంతయిన సంగతి తెలిసిందే. రెండ్రోజులు అయినప్పటికీ ఇంత వరకూ ఆ విమానం ఆచూకీ దొరక్కపోవడంతో అసలేం జరిగింది..? ఇంతకీ విమానం ఏమైంది...? విమానంలో ఉన్న 13 మంది సంగతేంటి..? విమానం కుప్పకూలిపోయిందా..? ఎందుకు ఆచూకీ లభించట్లేదు..? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. సోమవారం మధ్యాహ్నం 12.25 గంటల నుంచి ఇంత వరకూ అడ్రస్ తెలియకపోవడంతో ఎయిర్‌ఫోర్స్ అధికారులు విమానం ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.
అసలేం జరిగింది..!?
సోమవారం మధ్యాహ్నం అసోంలోని జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి ఏఎన్-32 బయల్దేరింది. అరుణాచల్ ప్రదేశ్‌లో మారుమూలన ఉన్న మెచుకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే గాల్లోకి ఎగిరిన కాసేపటికే విమానం అదృశ్యమైపోయింది. అప్పటి నుంచి విమానం కోసం వైమానిక దళం భారీ గాలింపు ఆపరేషన్ షురూ చేసింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో సోమవారం రాత్రి గాలింపును తాత్కాలికంగా నిలిపివేయగా.. మంగళవారం తెల్లవారుజాము నుంచి మళ్లీ గాలిస్తున్నారు. ఏఎన్-32 ఆచూకీ కోసం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ-17 విమానాలు, ఒక అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ విమానం కోసం గాలిస్తున్నాయి. మరోవైపు సైన్యం, ఇండో టిబెటెన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) సిబ్బంది సైతం రంగంలోకి దిగింది.
కాగా.. విమానం ఓ చోట కూలిపోయిందని పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమనడంతో గాలింపు బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకోగా.. అక్కడ శకలాలేమీ కనిపించకపోవడంతో వైమానిక దళం వెనుదిరిగింది. అయితే విమానం తక్కువ ఎత్తులో ఉన్న మేఘాల్లో చిక్కుకుపోయి ఉండొచ్చని ఎయిర్‌ఫోర్స్ అధికారులు భావిస్తున్నారు.
కనిపెట్టేస్తారా..!
ఇదిలా ఉంటే.. ఇస్రో ఉపగ్రహాలతో పాటు నౌకాదళానికి చెందిన పీ-81 గూఢచర్య విమానాలను కూడా రంగంలోకి దించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రెండింటి సహకారంతో ఏఎన్-32 విమాన శకలాలను కనుగొనడానికివైమానిక దళ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నౌకాదళానికి చెందిన ఈ విమానాలు తమిళనాడులోని అరక్కోణంలో ఉన్న నేవీ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరి వెళ్లాయి. అయితే ఈ ప్రయత్నం కచ్చితంగా సక్సెస్ అవుతుందని.. శుభవార్తతోనే తిరిగొస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వెంటాడుతున్న గతం.. భయం.. భయం!
2016లో కూడా ఇదే రకం విమానం చెన్నైలోని తాంబరం బేస్‌క్యాంప్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఆంటొనోవ్-32 ఎయిర్‌క్రాఫ్ట్ అండమాన్ వెళ్తూ బంగాళాఖాతం గగనతలంలోనే గల్లంతైంది. ఈ విమానం జాడ ఇప్పటికీ తెలియరాకపోవడం గమనార్హం. అంతేకాదు.. అసలు ఆ విమానం ఏమైందో కూడా ఇప్పటికీ తెలియట్లేదు. ఇందులో మొత్తం 29 మంది వైమానిక దళ జవాన్లు, వారి కుటుంబ సభ్యులు మరణించినట్లుగా అప్పట్లో అధికారులు ప్రకటించారు. అయితే ఏఎన్-32 విమానంకు కూడా అదే పరిస్థితి జరిగిందా..? అసలేమైంది.. ? అని వైమానిక దళ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments