Ustad Bhagat Singh:'ఉస్తాద్ భగత్ సింగ్' టీజర్ డైలాగ్స్‌పై ఈసీ ఏమందంటే..? వారికి వార్నింగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' టీజర్‌లోని డైలాగులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఇందులో జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. "గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది.. కచ్చితంగా గుర్తుపెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం" అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా స్పందించారు.
మీడియా సమావేశంలో ఈ టీజర్ గురించి ప్రస్తావన వచ్చింది. ఇందుకు ఆయన స్పందిస్తూ "నేనింకా అది చూడలేదు. అందుకే ఏమీ మాట్లాడలేను. అయితే గ్లాస్ చూపించి పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ యాడ్ కిందకు వస్తుంది. రాజకీయ ప్రకటన ఇవ్వడం తప్పేమీ కాదు. కానీ పొలిటికల్ యాడ్ చేయాలంటే పర్మిషన్ తప్పనిసరి. ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అది పొలిటికల్ యాడ్ అయితే వారికి నోటీసులు ఇస్తాం. ఆ తర్వాత రీసర్టిఫికేషన్ కోసం వాళ్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటిదాకా దానిపై మాకు ఫిర్యాదులు అందలేదు. ఎవరైనా కంప్లైంట్ చేసినా, చేయకపోయినా మేమైతే దానిని పరిశీలిస్తాం. పొలిటికల్ విషయాలు ఉంటే నోటీస్ ఇస్తాం. ఎందుకంటే ఫ్యాన్, సైకిల్, టీ గ్లాస్ అన్నీ మామూలుగా వాడేవే. అయితే రాజకీయ కోణంలో వాడితేనే స్పందించాల్సి ఉంటుంది" అని తెలిపారు.
ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ స్థలాల్లో 1.99 లక్షల హోర్డింగులు, ప్రైవేట్ స్థలాల్లో 1.15 లక్షల హోర్డింగులు తొలగించినట్లు తెలిపారు. మూడు రోజులుగా తనిఖీల్లో భాగంగా రూ.3.39 కోట్ల విలువైన మద్యం, నగదు అక్రమ రవాణను సీజ్ చేసినట్లు వెల్లడించారు. అలాగే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 46 మంది వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఏదైనా పార్టీకి అనుకూలంగా ఉద్యోగులు వ్యవహరిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఎన్నికల నిబంధలను ఉల్లంఘిస్తే ఎలాంటి అధికారినైనా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ వందల కొద్దీ ఫిర్యాదులు వస్తున్నాయని.. దీనిపై విద్యాశాఖ వివరణ కోరినట్లు పేర్కొన్నారు. వివరణ రాగానే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని.. సీఈసీ సూచనల మేరకు వాయిదాపై నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు.
గత రెండు రోజుల్లో జరిగిన హింసాత్మక ఘటనలపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి హింసాత్మక ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ఆళ్లగడ్డ, గిద్దలూరులో రెండు హత్యలు జరిగాయని, మాచర్లలో ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి కారును తగులబెట్టిన ఘటనలు జరిగాయన్నారు. ఈ ఘటనలపై ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల ఎస్సీలను వివరణ కోరారమన్నారు. వారు ఇచ్చే వివరణ ప్రకారం చర్యలుంటాయన్నారు. రాజకీయ హింస లేకుండా ఎన్నికలు జరపాలన్న తమ లక్ష్యమని వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com