కేబినెట్‌లోకి ఇద్దరు మహిళలు సరే.. కవిత సంగతేంటి!?
- IndiaGlitz, [Wednesday,August 28 2019]
అవును మీరు వింటున్నది నిజమే.. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాకా కూడా కేబినెట్‌లోకి మహిళను తీసుకోలేదన్న అపవాదు, ఆరోపణలకు త్వరలో చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కేబినెట్ విస్తరణలో భాగంగా ఒకరు కాదు ఏకంగా ఇద్దరు మహిళలను కేబినెట్‌లోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే.. ఒకానొక సందర్భంలో మహిళలను కేబినెట్‌లోకి తీసుకునే అంశంపై అసెంబ్లీలో కేసీఆర్ స్పందిస్తూ.. ఈసారి ఒక్కరు కాదు.. ఇద్దరు మహిళలను కేబినెట్‌లోకి తీసుకుంటానని ప్రకటించిన విషయం విదితమే.
ఆ సీనియర్లు వీరేనా..!?
అయితే సీనియర్లుగా ఉన్న సబిత, సత్యవతి రాథోడ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సత్యవతిని తీసుకుంటే, మహిళా కోటాతోపాటు ఎస్టీ కోటా కూడా కలిసి వస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌కు టాటా చెప్పేసి కారెక్కిన విషయం విదితమే. అంతేకాదు.. మొదట్లో కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మాత్రం సబిత, సత్యవతి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే కవిత పరిస్థితేంటి..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు!?
ఈ మంత్రి వర్గ విస్తరణకు సెప్టెంబరు 4, 12వ తేదీలు మంచివని ఆ రోజు దాదాపు పేర్లు కేటాయించే అవకాశాలుంటాయని తెలుస్తోంది. అంతేకాదు ఎవరైతే గత కేబినెట్‌లో మంత్రులుగా ఉంటారో వారిని మరోసారి తీసుకోకూడదని.. ఇప్పుడున్న వారిలో కూడా కొందర్ని మంత్రి పదవుల నుంచి తీసేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో..? ఎవరిని కేబినెట్‌లోకి తీసుకుంటారో..? ఎవర్ని కేబినెట్ నుంచి బయటికి పంపించేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.