మమతకు ఊహించని షాక్.. నందిగ్రామ్‌లో ఓటమి
- IndiaGlitz, [Monday,May 03 2021]
నందిగ్రామ్ ఎన్నికల ఫలితం క్షణక్షణం తీవ్ర ఉత్కంఠను రేపింది. విజయం సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేంద్ అధికారి మధ్య దోబూచులాడింది. చివరకు విజయం సువేంద్‌ను వరించింది. మమతపై ఆయన 1736 ఓట్ల తేడాతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. రౌండ్ రౌండ్‌కీ ఆధిక్యాలు మారుతూ రావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు సువేంద్ విజయం సాధించారు. తొలుత 1200 ఓట్లతో మమత గెలిచారని జాతీయ మీడియాలో మొదట్లో వార్తలొచ్చాయి.
Also Read: వైరల్ అవుతున్న డిసెంబర్ నాటి పీకే ట్వీట్..
అయితే తరువాత సుబేంద్ విజయం సాధించినట్టు వెల్లడించారు. అయితే ఓట్ల లెక్కింపులో ఏర్పడిన గందరగోళం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే సుబేందు గెలుపును ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు సుబేంద్ గెలుపును బీజేపీ నేత అమిత్ మాలవ్య ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి సుబేందు అధికారి 1,622 ఓట్లతో విజయం సాధించారు. ఈ అపజయం తర్వాత కూడా మమతా బెనర్జీ సీఎం పదవిలో కొనసాగడానికి ఏం అధికారం ఉంది? టీఎంసీ విజయానికి ఆమె ఓటమి ఒక కళంకంగా మారింది’’ అని అమిత్ మాలవ్య ట్వీట్లో పేర్కొన్నారు.
అటు తృణమూల్ కాంగ్రెస్ కూడా తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈసీ నందిగ్రామ్ ఫలితాన్ని ప్రకటించాల్సి ఉందని, కాబట్టి పుకార్లు వ్యాపింపచేయవద్దని సూచించింది. మరోవైపు సీఎం మమతా బెనర్జీ కూడా స్వయంగా ఈ ఓటమిని అంగీకరించారు. ‘‘నేను ఓటమిని అంగీకరిస్తున్నా. కానీ నేను కోర్టును ఆశ్రయిస్తున్నా. రిజల్ట్ వెల్లడించిన తరువాత కొన్ని మ్యానిప్యులేషన్స్ జరిగాయని నా వద్ద సమాచారం ఉంది. వాటన్నింటినీ నేను వెల్లడిస్తా’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.