రాజధాని రైతులకు భూములు తిరిగిచ్చేస్తాం.. మంత్రి ప్రకటన!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండొచ్చేమోనని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటన.. ఆ తర్వాత మంత్రులు మీడియా ముందుకొచ్చి రోజుకో మాట.. ఇలా వరుసగా ప్రకటనలతో అటు రాజధాని రైతులు.. ఇటు ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ మధ్యలో మళ్లీ కేబినెట్ భేటీ.. మరో కమిటీ, హై పవర్ కమిటీ ఇలా ప్రభుత్వం ప్రకటించుకుంటూ పోవడంతో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి. అమరావతిని మార్చొద్దని సుమారు పది రోజులకుపైగానే రాజధాని ప్రాంతంలోని గ్రామాల రైతులు ఆందోనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పుండుకు కారం చల్లినట్లుగా తాజాగా.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ప్రకటన చేశారు.
భూములు తిరిగిచ్చేస్తాం!?
‘రాజధానిని తరలించొద్దని ధర్నా చేస్తున్న అమరావతి ప్రాంత రైతులతో ఇప్పటికిప్పుడు మాట్లాడాల్సిన పని లేదు. ఇప్పటికిప్పుడే మాట్లాడితే ఫలితం ఉండదు. ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందొద్దా?. రాజధాని రైతుల భూములను ఎవరు లాక్కోవడం లేదు. రైతులకు ప్రభుత్వం కౌలు చెల్లిస్తుంది. ఆ డబ్బులతోనే సాగుకు అనుకూలంగా మార్చి భూములను రైతులకు తిరిగి ఇవ్వొచ్చు. 33 వేల ఎకరాలను డెవలప్ చేయడం సాధ్యం కాదు. తగు మాత్రంలో భూమిని తీసుకొని దాన్ని డెవలప్ చేస్తాం. ల్యాండ్ పూలింగ్ విధానంలోనే భూమిని తిరిగి ఇచ్చేసే అవకాశం ఉంది. రైతులకు మంచి ప్యాకేజీ కూడా ఇస్తాం’ అని సంచలన ప్రకటన చేశారు.
అయితే.. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక జనవరి 3న ప్రభుత్వానికి అందుతుందని ఆ తర్వాతే రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. బోస్టన్ గ్రూపు సేవలను గతంలో చంద్రబాబు కూడా వినియోగించుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రాజధాని రైతుల్లో మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయ్. మరి ఫైనల్ ఏం జరుగుతుందో తెలియాలంటే జనవరి 3 వరకు వేచి చూడక తప్పదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments