Nadendla: వైసీపీ తీసుకొచ్చిన అనాలోచిత చట్టాలు రద్దు చేస్తాం: నాదెండ్ల
- IndiaGlitz, [Tuesday,January 02 2024]
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనాలోచిత చట్టాలను టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు. భూ హక్కు చట్టం రద్దు చేయాలని గుంటూరు జిల్లా తెనాలిలో బార్ ఆసోషియేషన్ చేస్తున్న నిరసనకు నాదెండ్లతో పాటు మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సంఘీభావం తెలిపారు. కొంతమంది లబ్ధి కోసమే ప్రభుత్వం భూ హక్కు చట్టం-2023 తీసుకువచ్చిందని ఆరోపించారు. వైసీపీ నేతలు చేసిన భూకబ్జాలు, దోపిడీలను చట్టబద్ధం చేసుకునేందుకే ఈ చట్లం తీసుకువచ్చారని విమర్శించారు.
సామాన్యుడి ఆస్తులకు రక్షణ లేని చట్టాలు ఎందుకు అని ప్రశ్నించారు. కొత్త చట్టం ద్వారా వివాదాస్పద భూముల్ని కాజేసేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నారన్నారని ఆరోపణలు చేశారు. ఇప్పటికే భూవివాదాలకు సంబంధించి 563 సివిల్ కోర్టులు ఉన్నాయని.. కానీ వాటి స్థానంలో ట్రైబ్యునల్ చేస్తే ఎలా..?అని నిలదీశారు. దీని వల్ల కొత్త వివాదాలు తలెత్తుతాయని వివరించారు. న్యాయ వ్యవస్థలో ప్రభుత్వ పెద్దల జోక్యం మంచిది కాదని చెప్పుకొచ్చారు.
భూ యజమాని తన భూమి మీద శాశ్వత అధికారాన్ని కాపాడుకునేందుకు చాలా కష్టపడాల్సి వస్తుందని పేర్కొన్నారు. వ్యవస్థలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు వైసీపీ తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల ఎవరికీ ఉపయోగం లేదన్నారు. తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని.. లేనిపక్షంలో రాబోయే తమ ప్రభుత్వంలో జీవో 512 నిలిపి వేస్తామని హామీ ఇచ్చారు.