KTR:కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం.. ఫిరాయింపులపై కేటీఆర్ ట్వీట్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఉద్యమ పార్టీగా 14 సంవత్సరాలు పోరాటాలు చేసి.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీలోని కీలక నేతలందరూ ఒక్కొక్కరిగా జంప్ అయిపోతున్నారు. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే సీనియర్ నాయకులు కూడా పార్టీని వదిలి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఊహించని పరిణామాలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అసలు పార్టీ పరిస్థితి ఏంటని మదనపడుతున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. "శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్.. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్.. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారు.
ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCRను, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు.. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం" అంటూ పార్టీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు.
మొత్తానికి తెలంగాణను పదేళ్ల పాటు ఏలిన పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితులు రావడం కేసీఆర్ అండ్ కో జీర్ణించుకోలేకపోతున్నారు. ఉద్యమకారులను పక్కనపెట్టి ఉద్యమ ద్రోహులుగా ముద్రపడిన నాయకులను అక్కున చేర్చుకుని వాళ్లకి కేసీఆర్ కీలక పదవులు ఇచ్చారు. ఇతర పార్టీల నాయకులతో పార్టీని నింపేసి సొంత క్యాడర్‌ను తయారుచేసుకోలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఫిరాయింపు నేతలు పార్టీని వీడి వెళ్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా పార్టీ కోసం కష్టపడిన వారిని చేరదీసి సొంతంగా క్యాడర్ పెంచుకోవాలని సూచిస్తున్నారు.
శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్
— KTR (@KTRBRS) March 29, 2024
ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్
ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు…
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments