KTR:ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తాం: కేటీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జనం తమకు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. కార్యకర్తలు, నాయకులు ఎవరూ ఆందోళన చెందవొద్దని భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని పేర్కొన్నారు. ఫలితాలు నిరాశకు గురిచేసినా అసంతృప్తి మాత్రం లేదన్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని 70 ప్లస్ సీట్లు వస్తాయని చెప్పినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని అందుకే తానేమి బాధపడటం లేదని చెప్పారు.
హైదరాబాద్, మెదక్ జిల్లాలో ఫలితాలు దాదాపు బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఏకపక్షంగా ఉన్నాయని.. కరీంనగర్ జిల్లాలోనూ తమకు మంచి ఫలితాలే వచ్చాయన్నారు. ఓటమికి కారణాలు ఇప్పుడే చెప్పలేమని.. పార్టీ నేతలతో సమావేశంలో చర్చించి సమీక్షించుకుంటామన్నారు. అలాగే సింగరేణికి తాము చేసినంత మేలు మరెవ్వరూ చేయలేదని.. ప్రైవేటీకరణను అడ్డుకున్నామని.. కార్మికులకు 32 శాతం బోనస్ ఇచ్చామన్నారు. అయినా కానీ కాంగ్రెస్ అక్కడ పూర్తి మెజారిటీ సాధించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
23 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని.. 14 ఏళ్ల పాటు ఉద్యమంలో పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. అనంతరం ప్రజలు రెండు సార్లు తమకు ఇచ్చిన అధికారాన్ని సమర్థవంతంగా నిర్వర్తించామని వెల్లడించారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ కష్టపడతామని.. గోడకు కొట్టిన బంతిలా తిరిగి పుంజుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు చెబుతూ.. కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కొంత సమయకం ఇస్తామన్నారు. 39 స్థానాల్లో గెలిచిన గులాబీ పార్టీ అభ్యర్థులకు విషెస్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments