Revanth Reddy:రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకెళ్తాం.. రేవంత్ విజ్ఞప్తికి ప్రధాని మోదీ సానుకూలం..
- IndiaGlitz, [Monday,March 04 2024]
తెలంగాణ ప్రజల కలల సాకారానికి కేంద్రం ఎప్పుడూ ముందే ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. తెలంగాణ పర్యటనలో భాగంగా రామగుండం ఎన్టీపీసీ స్టేజ్ వన్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే ములుగు, బేలాలో రెండు జాతీయ రహదారులకు, ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి మోదీకి శాలువా కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ ఓ ఉదాహరణ అని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతుందని అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని తాము ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అందుకే హైవేల నుంచి అన్ని విభాగాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నామని స్పష్టంచేశారు. ఇందులో భాగంగా రూ.56 వేల కోట్లు అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం బలపడుతోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకన్న నిర్ణయాలతోనే దేశంలో పాతిక కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారని చెప్పుకొచ్చారు. పదేళ్లుగా అనేక రంగాల్లో వృద్ధిబాటలో దూసుకెళ్తున్నామని తెలిపారు.
ఇక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే తాము రాజకీయాలు చేస్తామని మిగిలిన సమయమంతా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకెళ్తామన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని.. ఎన్టీపీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. కంటోన్మెంట్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి పెద్దన్నలా మోదీ సహకారం అందించాలని.. ఈ క్రమంలోనే విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరారు.
కేంద్రంతో ఘర్షణపూరిత వైఖరితో ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుబడుతుందని అభిప్రాయపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ సహా చాలా రంగాల్లో వెనుకబడ్డామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందని... అయితే గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1,600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోందని విమర్శించారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. రేవంత్ విజ్ఞప్తులపై మోదీ సానుకూలంగా స్పందించారు.