నేటి సాయంత్రం పదో తరగతి పరీక్షలపై స్పష్టతనిస్తాం: ఏపీ విద్యాశాఖామంత్రి
- IndiaGlitz, [Saturday,June 20 2020]
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల్లో కొన్ని అనుమానాలున్నాయి. వాటన్నింటినీ నేడు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నేడు నివృత్తి చేశారు. పదో తరగతి పరీక్షలపై సమీక్ష నిర్వహించి నేటి సాయంత్రం లోపు ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు ఉన్న అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని సురేష్ పేర్కొన్నారు.
కాగా కర్ణాటకలో పదో తరగతి పరీక్షలపై సుప్రీంకోర్టు అనుమతిచ్చిన విషయాన్ని కూడా తాము పరిగణలోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అలాగే సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై 23లోగా పూర్తి నివేదికను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సంబంధిత అధికారులను కోరిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కూడా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించినట్టు తెలిపారు. కాబట్టి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ కలగనివ్వబోమని సురేష్ స్పష్టం చేశారు.