విశాఖ ఉక్కు కోసం వీలైతే వైజాగ్ వెళ్లి పోరాడుతాం: కేటీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయనున్నారనే వార్త ప్రస్తుతం ఏపీని కుదిపేస్తోంది. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసి తీరుతామని కొద్ది రోజులుగా కేంద్రం సంకేతాలిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో తేల్చి చెప్పారు. దీంతో ఏపీ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. అయితే ఈ సమస్యపై తాజాగా తెంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అవసరమైతే విశాఖ వెళ్లి మరీ పోరాటంలో పాల్గొంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను సైతం ప్రైవేటు పరం చేసేలా మోదీ వ్యవహార శైలి ఉందన్నారు.
ఏపీ ప్రజానీకం పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం అమ్మేసే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయంతో వేలాది మంది ఉక్కు ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని వారందరికీ అండగా నిలబడతామన్నారు. అవసరమైతే కేసీఆర్ అనుమతితో వైజాగ్ వెళ్లి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటామన్నారు. ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమం మనకెందుకులే అనుకుంటే రేపు మన దగ్గరకు కూడా వస్తారన్నారు. ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతున్నారని.. రేపు బీహెచ్ఈఎల్‌ని కూడా అమ్మేందుకు వెనుకాడరని.. ఎల్లుండి సింగరేణిని అమ్ముతారన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటు పరం చేసేయండి అంటారని కేటీఆర్ పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర పవర్ ఉద్యోగుల సంఘం కూడా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీ ప్రభుత్వ తీరును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించింది. ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్ర పవర్ ఉద్యోగుల సంఘం వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments