Achchennaidu:త్వరలోనే టీడీపీ-జనసేన మేనిఫెస్టో ఖరారుచేస్తాం: అచ్చెన్నాయుడు
- IndiaGlitz, [Thursday,November 09 2023]
ఈనెల 17 నుంచి టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా 'భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళతాయని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 14,15,16 తేదీల్లో రెండు పార్టీల ఆత్మీయ సమావేశాలు ఉంటాయని వివరించారు. ఆత్మీయ సమావేశాలు ఏ నియోజకవర్గంలో ఎప్పుడు అనేది ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు.
ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి సమన్వయ కమిటీ సమావేశం అవ్వాలని నిర్ణియంచుకున్నామని.. వచ్చే సమావేశం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టో ఖరారు చేస్తామని.. మేనిఫెస్టో రూపకల్పనపై రెండు పార్టీల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. నవంబర్ 13వ తేదీన ఈ కమిటీ భేటీ కానుందని పేర్కొన్నారు. జనసేన ప్రతిపాదించిన ఆరు అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. చంద్రబాబు బెయిల్ విషయంలో మరింత క్లారిటీ వచ్చాక వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి సభలు నిర్వహిస్తామని.. ఈ సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొంటారని చెప్పారు.
ఇక ఎప్పుడూ రానంత కరవు రాష్ట్రంలో వచ్చిందని.. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్రంలో కరవే లేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరవును ప్రధాన అంశంగా తీసుకుని టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తాయని వెల్లడించారు. రైతులకు కరవు సాయం, ఇన్‌పుట్ సబ్సిడీ అందేలా ఉద్యమం చేపడతామని స్పష్టంచేశారు. పంటల బీమా వ్యవస్థను కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వివిధ సమస్యలపై ఉమ్మడి పోరాటాలు రూపొందించేలా కార్యక్రమాలు రూపొందించామని ఆయన పేర్కొన్నారు.
వచ్చే శుక్ర, శనివారాల్లో రోడ్ల దుస్థితిపై ఉమ్మడి పోరాటం చేస్తామన్నారు. వివిధ వర్గాలకు అండగా నిలిచేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని బీసీ సమస్యలు.. బీసీల దాడులపై రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. టీడీపీ-జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసుల్లో న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నామని చెప్పుకొచ్చారు. ఇకపై ఎలాంటి రిప్రజెంటేషన్ ఇచ్చినా రెండు పార్టీలు కలిసే వెళ్తామని అచ్చెన్న క్లారిటీ ఇచ్చారు.