Kharge:తెలంగాణ కొత్త సీఎం ఎవరో ఇవాళే నిర్ణయిస్తాం:ఖర్గే
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్రానికి కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సోమవారం సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకున్నారు. ఆ నివేదికను ఏఐసీపీ పరిశీలకు అధిష్టానానికి పంపించారు. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు జోరందుకున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రాజ్‌భవన్‌లో రేవంత్‌తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఏర్పాట్లు సైతం ఏర్పాట్లు చేశారు. అయితే సీనియర్ నేతలు మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వంటి నేతలు తమకు కూడా సీఎంగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో సీఎం అభ్యర్థి ప్రకటన నిలిచిపోయింది. మరోవైపు ఏఐసీసీ పరిశీలకులుగా వచ్చిన డీకే శివకుమార్, ఇతర నేతలు ఢిల్లీకి వెళ్లారు.
సీఎం ప్రకటన ఎప్పుడు ఉంటుదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు తెరదించుతూ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు. ఇవాళ సాయంత్రం లోపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేస్తామని స్పష్టంచేశారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. ఇవాళే సీఎంతో పాటు డిప్యూటీ సీఎంల ప్రకటన ఉండనుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే ఖర్గేతో సమావేశం అయ్యారు. కొత్త సీఎం, మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం సీల్డ్ కవర్ తీసుకుని హైదరాబాద్ రానున్నారు. అందులో ఎవరి పేరు ఉంటే వారే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. కాసేపట్లో ఖర్గే సమావేశమై తమ ప్రతిపాదనలను వివరించనున్నారు. అలాగే ప్రస్తుతం నల్లగొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవీకి రాజీనామా చేయనున్నారు. ఆయన హుజుర్ నగర్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఎంపీగా రిజైన్ చేస్తున్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. అలాగే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఎందుకంటే ఎంపీగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే రెండింటిలో ఓ పదవిని 14 రోజుల్లోపు వదులుకోవాల్సి ఉంటుంది. అందుకే వీరు తమ ఎంపీ పదవులను వదిలేయనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు నేతలు ఎమ్మెల్యేలుగా ఓడిపోవడంతో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments