Chandrababu:వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
వాలంటీర్లు వైసీపీ కోసం మాత్రం పనిచేయవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. అనంతపురం జిల్లా పెనుకొండలో నిర్వహించిన 'రా కదలిరా' సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఐటీ ఉద్యోగాలు ఇస్తే.. జగన్ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడంటూ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించమని స్పష్టం చేశారు.
గతంలో అనంతపురం జిల్లాలో రక్తం పారిస్తే.. తాను అధికారంలోకి వచ్చిన నీళ్లు పారించానని తెలిపారు. సాగునీరు ఇస్తే చాలు... రాయలసీమ రైతులు బంగారం పండిస్తారన్నారు. జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ రావాలి, తుంపర్ల సేద్యం రావాలి... తద్వారా రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. వెనకబడిన ప్రాంతానికి కియా పరిశ్రమను తీసుకొచ్చామన్నారు. ఇప్పటివరకు 12 లక్షల కార్లు తయారయ్యాయని.. దీని వల్ల ప్రత్యక్ష, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇందుకోసం గొల్లపల్లి రిజర్వాయర్‌ను 18 నెలల్లో పూర్తి చేసిన నీరు అందించామని చెప్పారు.
2014లో ఈ ప్రాంతం ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది?అని నిలదీశారు. తాము అధికారంలో ఉంటే సాగునీరు, పెట్టుబడులు, ఉపాధి పెరిగేవన్నారు. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాయలసీమకు తెచ్చిన పెట్టుబడులు ఏమిటో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఐదేళ్లలో ఏదైనా ప్రాజెక్టు నిర్మించారా? రాయలసీమకు ఏ పార్టీ మేలు చేసిందో ప్రజలు గ్రహించాలని కోరారు. రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తాను, పవన్ కల్యాణ్ తీసుకుని ముందకెళ్తున్నామని ఇందుకోసం ఎలాంటి త్యాగాలకైనా మేం సిద్ధం... మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు.
ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు కేతిరెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈయనొక కాగితం పులి... నిద్రలేస్తే గుడ్ మార్నింగ్ అంటూ షో చేస్తారంటూ విమర్శించారు. ఎర్రగుట్టను మింగేసిన వ్యక్తి ఆయన అని మండిపడ్డారు. ఇక రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి దందాలు, దౌర్జన్యాలు పెరిగాయి. తోపుదుర్తి లెక్కలన్నీ తన వద్ద ఉన్నాయని.. తాము అధికారంలోకి రాగానే అందరి అకౌంట్స్ సెటిల్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనంటూ చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments