Kishan Reddy:తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీ చేస్తాం: కిషన్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
పార్లమెంట్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జిలు, లోక్‌సభ నియోజకవర్గాల ఇంఛార్జిలతో ఆయన సమావేశం అయ్యారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీకి ఏ పార్టీతో పొత్తులు ఉండవని.. ఒంటరిగానే పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. సర్వేలకు అందని విధంగా లోక్‌సభ ఫలితాలు ఉంటాయని తెలిపారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవంగా జనసేన ఒంటరిగా 32 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే బీజేపీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్.. పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి పొత్తు కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీకి 8 సీట్లు కేటాయించారు. అయితే పార్టీ క్యాడర్ మాత్రం జనసేన అభ్యర్థులకు మద్దతు తెలపలేదు. అందుకే పోటీ చేసిన 8 సీట్లలో గ్లాస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. ఇప్పుడు ఏకంగా పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు లేదని ప్రకటించడంపై జనసేన వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అవసరానికి తమను వాడుకుని ఇప్పుడు వదిలేస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నామని జనసేన ప్రకటించినా క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా కలిసి పనిచేయడం లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కమలం పార్టీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో జనసేనను దూరం చేసుకోవాలని బీజేపీ భావించడంతో ఏపీలో కూడా కటీఫ్ అయ్యే అవకాశం ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి జనసేనతో పొత్తుపై బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments