YS Sharmila: ప్రధాని మాట ఇచ్చిన తిరుపతిలోనే హోదాపై డిక్లరేషన్ ప్రకటిస్తాం: షర్మిల

  • IndiaGlitz, [Wednesday,February 28 2024]

ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ కీలక హామీ ఇచ్చింది. మార్చి ఒకటో తేదిన తిరుపతిలో నిర్వహించబోయే సభలో హోదాపై డిక్లరేషన్ చేస్తుందని ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల(YS Sharmila) తెలిపారు. విజయవాడలోని కాంగ్రెస్ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడుతూ అనంతపురం సభలో ఇందిరమ్మ అభయం పేరుతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఒక అద్భుత పథకం ప్రకటించారని చెప్పారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు రూ.5వేల రూపాయలు అందిస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక చేత్తో సంక్షేమం, ఒక చేత్తో అభివృద్ధి అందించారు కాబట్టే ప్రజలందరి గుండెల్లో నిలిచారని గుర్తుచేశారు.

మహానేత YSR సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో.. రాష్ట్ర అభివృద్ధికి సైతం అంతే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన అడుగుజాడల్లోనే అనంతపురం సభలో సంక్షేమంపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ .. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి హోదాపై కీలక డిక్లరేషన్ చేయబోతుంది. మార్చి ఒకటిన తిరుపతిలో జరిగే సభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ చేయబోతున్నాం. ప్రధానమంత్రి హోదాలో మోదీ మాట ఇచ్చిన తిరుపతిలో అదే మైదానంలో హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ చేస్తుంది.
ప్రత్యేక హోదా అవసరం గురించి రాష్ట్రంలో అందరికీ తెలిసినా ప్రధాన రాజకీయ పార్టీలు మాట్లాడవు. గత ఎన్నికలలో హోదాను రాజకీయ ప్రచారం కోసం వాడుకుని అధికారంలోకి వచ్చారు.పదవొచ్చాక పోరాటం చేయడం మరిచారు. చంద్రబాబు, జగన్‌లు మాత్రం మోదీకి బానిసలుగా మారారు.ఈ పదేళ్లలో హోదాపై నిజమైన ఉద్యమం చేసిన వారే లేరు. వీరిని ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? అని ఆమె తెలిపారు.

ఉత్తరాఖండ్‌లో ప్రత్యేక హోదా కారణంగా 2000 పరిశ్రమలు వచ్చాయి. 972 కిలోమీట్ల సముద్ర తీరం ఉన్న మన రాష్ట్రంలో పది పరిశ్రమలు కూడా రాలేదు. ఇలాగే కొనసాగితే యువతే లేని రాష్ట్రంగా మన రాష్ట్రం తయారవుతుంది. ఆంధ్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా.. గత ఎన్నికల్లో 1.18 శాతం ఓటు షేరు ఉన్నా.. ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది కనుకనే నేను చేరాను. టీడీపీ, వైసీపీ, బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. హోదా, పోలవరం, కడప స్టీలు, విశాఖ ఉక్కు, రాజధాని కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి’ షర్మిల వెల్లడించారు.