Allu Aravind:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం: అల్లు అరవింద్
- IndiaGlitz, [Monday,December 04 2023]
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని.. త్వరలోనే మూవీ ఇండస్ట్రీ తరపున కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తామన్నారు. సినీ పరిశ్రమను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త కాదని.. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు సినీ పరిశ్రమను ఎంతో ప్రోత్సహించాయని తెలిపారు. అలాగే ఈ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నట్నలు అరవింద్ వెల్లడించారు.
మరోవైపు ప్రభుత్వం మార్పు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. భవిష్యత్‌లో సినీ పరిశ్రమ ఎలా ఉండనుంది? సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారాలు ఎలా ఉండనున్నాయి? సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? ఇకనైనా నంది అవార్డులు ఇస్తారా..? అని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ వచ్చాక తొమ్మిదేన్నరళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో సినీ ప్రముఖులు ప్రభుత్వ పెద్దలతో క్లోజ్‌గా ఉండేవారు. ముఖ్యంగా కేటీఆర్‌తో పాటు సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసిన తలసాని శ్రీనివాస యాదవ్‌తో మంచి సంబంధాలు ఉండేవి. సినిమా ఈవెంట్లను పిలవగానే వెళ్లేవారు.
కరోనా సమయంలో చిరంజీవి, నాగార్జున అప్పటి నేరుగా సీఎం కేసీఆర్‌ను కలిసి సినీ కార్మికుల సమస్యలను విన్నవించుకున్నారు. టికెట్ల రేట్లు, షూటింగ్ పర్మిషన్స్ ఇలా అన్ని విషయాల్లో ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారనుండటంతో కాబోయే సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? సినిమా వాళ్లతో ప్రభుత్వం తరపున ఎవరు మాట్లాడతారు అనే సందేహాలు ఫిల్మ్‌నగర్ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. ఇప్పుడు ఆయనకి ఈ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. మరి ఈ ప్రశ్నలకు మరికొన్ని రోజుల్లో సమాధానం దొరకనుంది.