Pawan Kalyan: లక్ష మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురం నాయకులతో జనసేనాని..
- IndiaGlitz, [Tuesday,March 19 2024]
ఇక నుంచి పిఠాపురంను తన స్వస్థలం చేసుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పిఠాపురంకు చెందిన స్థానిక నేతలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. వీరికి పవన్ కల్యాణ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా తనకు పిఠాపురం అంటే తనకు చాలా ఇష్టమన్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కనీసం తనను లక్ష మెజార్టీతో గెలిపించాలని.. వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు.
2019లో పిఠాపురం నుంచి పోటీ చేయాలంటే ఆలోచించాను. ఈ చోటును ఓ నియోజకవర్గంగా చూడలేదు. ఇక్కడ ఉండే కొన్ని గొడవలు, కులాల విషయాలు అన్ని చూశాను. కులాల ఐక్యత ఉంటూనే కాపు సమాజం పెద్దన్న పాత్ర పోషించాలి. ఈరోజు తన కల సాకారం కానుంది. పిఠాపురం నుంచి కులాల ఐక్యత మొదలైంది. భీమవరం, గాజువాక, పిఠాపురం నియోజకవర్గాలు నాకు మూడు కళ్లు. నా గెలుపు కోసం ఆలోచించకుండా, పార్టీ కోసం ప్రజల కోసం ఆలోచిస్తుంటే.. మిమ్మల్ని అసెంబ్లీకి పంపించే బాధ్యత మేం తీసుకుంటామని పిఠాపురం నేతలు, ప్రజలు చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. పిఠాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ దశా దిశ మార్చే ప్రయత్నం చేద్దాం. ఈసారి గట్టిగా కొడుతున్నామని.. భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అని పేర్కొన్నారు.
ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతకు గురై మత్స్యకార కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో తెలుసు. ఈ నియోజకవర్గాన్ని ఏపీకి మోడల్ నియోజకవర్గంగా చేద్దాం. ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం. నేను అందరినీ కలుపుకుని వెళ్లే వ్యక్తిని.. ఒక్కసారి నాతో కలిసి వస్తే ఎప్పటికీ పార్టీని వీడరు. గత ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వేశామని కొందరు చెప్పారు. ఈసారి ఆ ఓట్లు కూడా జనసేన పార్టీకి వేయాలని సూచిస్తున్నాను అంటూ పవన్ వెల్లడించారు.