President Murmu: 500 ఏళ్ల నాటి అయోధ్య రామమందిరం కల నెరవేర్చాం: రాష్ట్రపతి
Send us your feedback to audioarticles@vaarta.com
పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ప్రసంగించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్‌లో ఇవే తొలి బడ్జెట్ సమావేశాలు కావడం విశేషం. వికసిత భారతావనిని నిర్మించే పనిలో గడిచిన పదేళ్లలో ఎన్నో మైలు రాళ్లు చేరుకున్నామని ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 33 శాతం పెరుగుతుందని వెల్లడించారు. తెలంగాణలో సమ్మక్క - సారక్క గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు.
500 ఏళ్లుగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఉన్న అన్ని ఆటంకాలు అధిగమించి.. కోట్లాది మంది ఎదురుచూపుల మధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ణ కార్యక్రమం కన్నుల పండువగా జరిగిందని చెప్పుకొచ్చారు. దీంతో ఎన్నో ఏళ్ల భారతీయుల కల సాకారమైందని ఆమె తెలిపారు. అలాగే కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు లాంటి చారిత్రక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మొట్టమొదటి సారిగా G20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించుకున్నామన్నారు. చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా నిలిచామని ప్రశంసలు కురిపించారు. ఇక ఆసియా క్రీడల్లో తొలిసారి 107 పతకాలు, పారా క్రీడల్లో 111 పతకాలను సాధించి భారత్ జెండా రెపరెపలాడిందని కొనియాడారు.
తమ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం కట్టుబడి ఉందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. మన బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే చాలా శక్తిమంతంగా తయారైందని వివరించారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్ కొండంత బలాన్నిచ్చాయని పేర్కొన్నారు. గరీబీ హఠావో నినాదాలు ఒకప్పుడు నినాదాలుగానే మిగిలిపోయాయని.. మోదీ సర్కార్‌లో నిజం అవుతున్నాయని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోందని.. ఇలా ఎన్నో అంశాల్లో భారత్ దూసుకుపోతోందని రాష్ట్రపతి వెల్లడించారు.
అంతకుముందు ప్రధాని మోదీ(PM Modi) మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘దిశా నిర్దేశక్’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రయాణం కొనసాగుతుందని.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు పలు సూచనలు చేశారు. పార్లమెంట్ కార్యకలాపాలను తరచూ అడ్డుకునే ఎంపీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యనికి వ్యతిరేకంగా అనైతికంగా వ్యవహరించిన వారు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలన్నారు. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునే వారిని ప్రజలు కూడా క్షమించరని మోదీ విమర్శించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout