Komatireddy Venkatreddy:యాదాద్రి కాదు యాదగిరిగుట్టగా మారుస్తున్నాం.. త్వరలోనే జీవో: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు త్వరలోనే జీవో జారీ చేస్తామని పేర్కొన్నారు. ఆయన తాజాగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ "కేటీఆర్ ఇప్పటికీ తండ్రి కేసీఆర్ చాటు కొడుకే. నేను ఉద్యమాలు చేసి వచ్చాను. మేం జీరో బిల్ ఇచ్చినట్టు.. కేటీఆర్‌కి జీరో నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం వృథా. ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ కూడా బీజేపీలోకి పోతాడు. కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదు?" అని ప్రశ్నించారు.
"కాళేశ్వరం పనికిరాదని ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్ ఇచ్చింది. ప్రజలే కేసీఆర్‌ను నామరూపాలు లేకుండా చేశారు. ఎంపీ అభ్యర్థులపై అంతర్గత సర్వే జరుగుతోంది. భువనగిరి నుండి పోటీ చేయమని రాహుల్ గాంధీని కోరాను. భువనగిరి, ఖమ్మం, నల్గొండలో.. దక్షిణాదిలో టాప్ మెజార్టీ వస్తుంది. మోదీ కంటే రాహుల్ గాంధీ ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు" అని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
కాగా యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మారుస్తామని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రెండు రోజుల క్రితం ప్రకటించారు. పూర్వం నుంచి ఉన్న పేరును మార్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తారని.. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి కూడా ఇదే మాట చెప్పడంతో యాదాద్రి పేరు మారడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో యాదగిరిగుట్ట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తిరుమల స్థాయిలో ఈ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పునర్నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చినజీయర్ స్వామి సూచనలతో యాదాద్రిగా పేరు మార్చారు. అయితే ప్రజలు మాత్రం యాదగిరిగుట్టగానే పిలుస్తున్నారు. దీంతో యాదాద్రి పేరు మార్చాలనే వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టగా మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో విడుదల చేసేందుకు సిద్ధమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout