ఈగ వాలినా ఊరుకోను.. ఖబడ్డార్ బాలకృష్ణా!
- IndiaGlitz, [Tuesday,April 09 2019]
ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఇటీవల విజయనగరం పర్యటనలో వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. చీపురుపల్లిలో ఓ అభిమానిని నడిరోడ్డుపై వెంబడించి మరీ కొట్టిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుండంగా వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులే కాదు.. టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ కీలకనేత బొత్సా సత్యనారాయణ మాట్లాడుతూ ఖబడ్డార్.. బాలకృష్టా.. అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఈగవాలినా ఊరుకోను..!
చీపురుపల్లిలోని జి.అగ్రహారంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల సభలో బొత్స మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్త అయినా.. చీపురుపల్లికి చెందిన ఓ కుర్రాడిని కొట్టే అధికారం బాలకృష్ణకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బాధిత యువకుడు ఏ పార్టీకి చెందిన వాడో మాకు అనవసరం కానీ చీపురుపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తిపై ఈగ వాలినా ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
బొత్స మాటల్లోనే..
మీరు సినిమా నటులైతే మీ యాక్షన్లు సినిమాల్లో చూపించుకోవాలి అంతే తప్ప వీధుల్లోకి వచ్చి మా కుర్రాళ్లను కొడతామంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు. ఈ మాట గుర్తుంచుకోండి. మీరు కొట్టిన యువకుడికి బాలకృష్ణ భేషరతుగా క్షమాపణ చెప్పాలని లేదంటే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఉంటాయి. వీధుల్లోకి వచ్చి ఇష్టానుసారంగా వ్యక్తిత్వ విలువలు కోల్పోయి కొడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజాస్వామ్యంలో విలువలు, వ్యక్తిత్వం ముఖ్యం. ప్రజాస్వామ్య విలువలు లేని ఇలాంటి వ్యక్తులను దగ్గరకు చేర్చితే వ్యవస్థకు నష్టం అని ఈ సందర్భంగా బాలయ్యపై బొత్స కన్నెర్రజేశారు. అయితే ఈ వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.