Download App

Vunnadhi Okate Zindagi Review

ప్రేమ‌, స్నేహం ఈ రెండు జీవితానికి చాలా అవ‌స‌ర‌మైన అంశాలు. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి వాటి ప్రాధాన్య‌త సంత‌రించుకుంటూ ఉంటాయి. అయితే కొన్ని సార్లు కొన్నింటిని, కొంద‌రి కోసం వ‌దులుకోవాల‌నుకున్న‌ప్పుడు ఎందుకోసం చేశామ‌నేది కూడా ముఖ్య‌మే. ఇలాంటి కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించిన చిత్ర‌మే `ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ`. ఇద్ద‌రు ప్రాణ స్నేహితులు. ప్రేమ కార‌ణంగా వారిద్ద‌రూ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నారు? అనే కాన్సెప్ట్‌పై ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల రాసుకున్న క‌థే `ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ`. గ‌తంలో రామ్‌, కిషోర్ కాంబోలో వ‌చ్చిన నేను శైల‌జ మంచి విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో సినిమా అంటే మంచి అంచ‌నాలే ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు. మ‌రి సినిమా ఈ అంచ‌నాల‌ను ఎంత వ‌ర‌కు రీచ్ అయ్యిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. క‌థ‌లోకి ఓ లుక్కేద్దాం..

క‌థ:

అభి(రామ్‌), వాసు(శ్రీ విష్ణు) ప్రాణ స్నేహితులుగా పెరిగి పెద్ద‌వుతారు. పెద్ద‌యిన త‌ర్వాత అభి ఓ రాక్ బ్యాండ్‌లో స‌భ్యుడిగా కొన‌సాగుతూ ఉంటారు. అభిని ఎవ‌రైనా ఏమైనా అంటే వాసుకి న‌చ్చ‌డు. అలాగే వాసుని ఎవ‌రేమ‌న్నా అన్నా, అభికి న‌చ్చ‌దు. ఓ ప్రాజెక్ట్ ప‌నిపై వాసు ఢిల్లీ వెళతాడు.  ఆ స‌మ‌యంలో మ‌హా(అనుప‌మ‌), అభికి ప‌రిచ‌యం అవుతుంది. కొద్ది రోజుల్లోనే అభి, మ‌హా మంచి స్నేహితులవుతారు. ఎదుటివారి అభిప్రాయాల‌ను గౌర‌వించే అభి అంటే మ‌హా ఇష్ట‌ప‌డుతుంది. అలాగే మ‌హా అంటే కూడా అభి ఇష్ట‌ప‌డ‌తాడు. అయితే త‌న ప్రాణ స్నేహితుడు వాసు మ‌ర‌దలే..మ‌హా అని అభికి తెలుస్తుంది. ఇద్ద‌రూ త‌మ ప్రేమ విష‌యాన్ని మ‌హాకు చెబుతారు. అయితే త‌ను ఇష్ట‌ప‌డుతున్న అభిని కాద‌నుకుని మ‌హా, వాసుని పెళ్లి చేసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డుతుంది. అదే స‌మ‌యంలో అభి, వాసు మ‌ధ్య గొడ‌వ జ‌రిగి, ఇద్దరూ విడిపోతారు. అభి ఎవ‌రికీ చెప్ప‌కుండా ఎక్క‌డికో వెళ్లిపోతాడు. కానీ త‌న ప్రాణ స్నేహితుడుకి జ‌రిగిన న‌ష్టం తెలుసుకున్న అభి మ‌ళ్లీ అత‌ని ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు. వీరి మ‌ధ్య‌లో మ‌రో అమ్మాయి మ్యాగీ ప్ర‌వేశిస్తుంది. అప్పుడు మ‌ళ్లీ క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంటుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ప్ల‌స్ పాయింట్స్ఃరామ్‌, ప్రియ‌ద‌ర్శి, అనుప‌మ న‌టన బావుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన పాట‌లు, స‌న్నివేశాల‌తో క‌లిపి చూసిన‌ప్పుడు ఆక‌ట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా  బావుంది. స‌మీర్ రెడ్డి ప్ర‌తి సన్నివేశాన్ని చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. క్లైమాక్స్ సీన్‌లో ట్విస్ట్ ఒకే. అలాగే ఇంట‌ర్వెల్ ట్విస్ట్ కూడా బావుంది.

మైన‌స్ పాయింట్స్:

ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల స్నేహంపై సినిమాను తీయాల‌నుకుని, దానికి ప్రేమ‌ను యాడ్ చేశాడు. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు సినిమాను ఓ మోస్తారుగానే న‌డిపించాడు. ఇక సెకండాఫ్‌లో క్లైమాక్స్ వ‌ర‌కు లాగ‌డానికి ప‌డ్డ తిప్ప‌లు వ్ల‌ల , ఆ సినిమాను ప్రేక్ష‌కుడి చూడ‌టానికి తిప్ప‌లు ప‌డాల్సి వ‌స్తుంది. ఫ‌స్టాఫ్ లో ఇంటర్వెల్ ఎప్పుడా అని చూసిన ప్రేక్ష‌కుడికి, క్లైమాక్స్ ముందుకు ఎప్పుడు పారిపోదామా అని ఎగ్జిట్ వైపు చూడాల్సిన ప‌రిస్థితి.

విశ్లేష‌ణ:

ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల నేను శైల‌జ‌లో రామ్‌ను కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్న‌మైతే చేశాడ‌న‌డంలో సందేహం లేదు. ప్రేమ‌, స్నేహం అనే రెండు బ‌ల‌మైన ఎమోష‌న్స్‌ను తెర‌పై చూపించాల‌నుకుంటే బ‌ల‌మైన స‌న్నివేశాలు అవ‌స‌రం. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల ఫెయిల్ అయ్యాడు. ఫ‌స్టాఫ్‌లో క‌న‌ప‌డ్డ కాస్తా, సెకండాఫ్‌లో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. పెళ్లిలో స్నేహితులు క‌లుసుకోవ‌డం, సస్పెన్స్ థ్రెడ్‌ను ఎక్క‌డా మెయిన్‌టెయిన్ చేయ‌క పోవ‌డం వ‌ల్ల సినిమా చ‌ప్ప‌గా క‌న‌ప‌డుతుంది. క్లైమాక్స్ సీన్ బావుంది. అలాగే ప్ర‌థ‌మార్థం ముగింపు ద‌గ్గ‌ర ఉన్న ట్విస్ట్ కూడా మెప్పిస్తుంది. రామ్ పాత్ర‌లో ఒదిగిపోవ‌డానికి త‌న శ‌క్తి మేర ప్ర‌య‌త్నించాడు. స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌న మిచ్చాడు. అనుప‌మ పాత్ర బావుంది. ఈమె పాత్ర ఫ‌స్టాఫ్‌కే ప‌రిమితం అయిన ఉన్నంత వ‌ర‌కు అనుప‌మ రోల్ మెప్పిస్తుంది. లావ‌ణ్య రోల్‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ క‌న‌ప‌డ‌దు.

`నీకోసం అమ్మాయి ఏడిస్తే చూడాల‌నుకున్నావు..కానీ న‌న్ను మాత్రం ఏడిపించేస్తున్నావ్‌`.

`మ‌న‌కు న‌చ్చిన వ్య‌క్తి గురించి ఇంట్లో వారితో అర్గ్యుమెంట్ చేయ‌వ‌చ్చు, కానీ న‌చ్చిన వ్య‌క్తితో ఆర్గ్యుమెంట్ చేయ‌లేం`....

`మ‌హా లైఫ్‌లో చివ‌రి రెండు లైన్స్ మాత్ర‌మే ప‌రిమితం చేశావు..మ‌ళ్లీ మ‌రో అమ్మాయి జీవితంలో నన్ను రెండు లైన్స్‌కు ప‌రిమితం చేయ‌కు`..వంటి డైలాగ్స్‌తో ద‌ర్శ‌కుడు త‌న డైలాగ్స్లోని ప‌దును చూపించాడు. మొత్తంగా సినిమాను ఓసారి చూడ‌టానికి కాస్త ఇబ్బంది ప‌డాల్సిందే. అఅయితే కొన్ని స‌న్నివేశాలు మాత్రం ఆక‌ట్టుకుంటాయి.

బాట‌మ్ లైన్: ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ...ఓసారి మాత్ర‌మే(ఇబ్బందిగానే)

Vunnadhi Okate Zindagi Movie Review in English

 
Rating : 2.5 / 5.0