CM KCR:ఆగమాగం కావొద్దు.. విచక్షణతో ఓటు వేయండి.. ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు
Send us your feedback to audioarticles@vaarta.com
పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో సీఎం కేసీఆర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజుకు రెండు, మూడు సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. విపక్షాల తీరును ఎండగడుతూ ప్రజలకు చేరువుతున్నారు. ఈరోజు భైంసా, ఆర్మూర్, కోరుట్ల నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కాకుండా అభ్యర్థి గుణగుణాలు, పార్టీ చరిత్ర గురించి తెలుసుకుని ఓటు వేయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ విచక్షణతో ఓటు వేయకపోతే.. బాధ పడాల్సి వస్తుందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైన ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి రాలేదని తెలిపారు. ఏ దేశంలో అయితే ప్రజాస్వామ్య పరిణితి వచ్చిందో ఆ దేశాలు బాగా పురోగతి చెంది ముందుకు పోతున్నాయన్నారు. ఎవరో చెప్పిన మాటలు విన్ని మోసపోవద్దని బీఆర్ఎస్ తరపున విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
తెలంగాణ కోసమే బీఆర్ఎస్..
తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పుట్టిందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్మూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ అంకాపూర్ అంటే తనకు ప్రాణంతో సమానమని.. బహుషా అంకాపూర్ గురించి తాను చేసినంత ప్రచారం ఎవరూ చేయలేదన్నారు. అంకాపూర్ రైతులను స్ఫూర్తిగా తీసుకొని వందలాది గ్రామాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయని కొనియాడారు. ఇక దశాబ్దాలుగా వెనుకబడి ఉన్న ఎస్సీలు బాగుపడాలనే ఉద్దేశంతోనే దళిత బంధు పథకం తెచ్చామని, ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటామని స్పష్టంచేశారు. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
మళ్లీ అధికారంలోకి రావాలి..
అనంతరం కోరుట్లలోని ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ ఓ వైద్యుడిగా రూ.కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ ఆయన ప్రజాసేవ చేద్దామనే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. తాను ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పుడు పక్కనే ఉండి తన ప్రాణాలు కాపాడారని గుర్తుచేశారు. యువకుడు, వైద్యుడు అయిన సంజయ్‌ను మీరంతా ఆశీర్వదించాలని కోరుట్ల ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. మూడోసారి అధికారంలోకి రాగానే తెల్లరేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్, బీజేపీ ఏం చేయలేదు..
రైతుబంధు దుబారా అని.. రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి ఎత్తేస్తామని చెబుతున్నారని అదే జరిగితే మళ్లీ పైరవీలు మొదలవుతాయని హెచ్చరించారు. ధరణి తీసివేస్తే రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తాయని అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏం మేలు చేసిందని ఆయన నిలదీశారు. దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ వెల్లడించారు. ఇక ప్రధాని మోదీ రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వలేదని విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమన్నారు కానీ మన రైతులకు నష్టం కలుగుతుందని తాను పెట్టలేదని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout