YS Jagan: కాబోయే లీడర్లు వాలంటీర్లే.. యుద్ధానికి సిద్ధం కావాలని సీఎం జగన్ పిలుపు..
Send us your feedback to audioarticles@vaarta.com
రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే అని ఏపీ సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వాలంటీర్లే తన సైన్యం అని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో నిర్వహించిన వాలంటీర్లకు అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు సేవలు చేసిన వాలంటీర్లను నగదు పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే సైనికులు, పేదల చెంతకు సంక్షేమాన్ని చేరవేసే వారధులు వాలంటీర్లు అని కొనియాడారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలైతే... మన వాలంటీర్లు తులసి మొక్క అని చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. వాలంటీర్, సచివాలయాల వ్యవస్థల ద్వారా ప్రతి గ్రామంలో ఆసుపత్రులు, స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయన్నారు. అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులకు వాలంటీర్ల వ్యవస్థ తోడుగా ఉందని చెప్పారు. సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి వాలంటీర్లు పెన్షన్లను అందిస్తున్నారని అభినందించారు. పేదల భవిష్యత్తు మార్చేందుకు రాబోయే ఎన్నికల యుద్ధానికి సిద్ధమా అని వాలంటీర్లను ఉద్దేశించి ప్రశ్నించారు. పేదలకు సేవ చేయడానికే మన వ్యవస్థలు పుట్టుకొచ్చాయని చెప్పుకొచ్చారు.
గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేదని.. కానీ ఇప్పుడు గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి పని నేరుగా వారి గ్రామంలోనే చేసిపెట్టామన్నారు. గత ప్రభుత్వం లంచాలు అలవాటు చేసిందని.. మన ప్రభుత్వం లంచం లేని వ్యవస్థను సృష్టించిందని పేర్కొన్నారు. రూ.390 కోట్లు వాలంటీర్ వ్యవస్థకు ఖర్చు పెడుతున్నామని తెలియజేశారు. ప్రజల కష్టాల నుండి పుట్టిన మేనిఫెస్టో మనది అయితే హైదరాబాద్ నుండి పుట్టిన మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీది అని విమర్శించారు.
చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని వాలంటీర్లకు సూచించారు. బాబు మాటలను నమ్మితే నిండా మునిగిపోతారని ప్రతి రైతుకు చెప్పాలన్నారు. చంద్రబాబుకు ఓటు వేయడమంటే ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ ఇంట్లోకి తెచ్చుకోవడమే అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇటువైపు మీ బిడ్డ ఒక్కడే ఉన్నాడని అటువైపు చంద్రబాబు, దత్తపుత్రుడు, అనుకూలంగా ఉన్న మీడియా, ప్రత్యక్షంగా మద్దతిస్తున్న ఓ జాతీయ పార్టీ, పరోక్షంగా మద్దతిస్తున్న మరో జాతీయ పార్టీ ఉన్నాయని చెప్పారు. తనకు మాత్రం అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, వాలంటీర్లు అండగా ఉన్నారని జగన్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout