ఆ కోరికను ‘వాళ్లిద్దరి మధ్య’ తీర్చింది: వి.ఎన్. ఆదిత్య

  • IndiaGlitz, [Friday,January 24 2020]

తొలి చూపు... తొలి వలపు- ఈ రెండింటికీ ఉన్న అవినాభావ సంబంధం మూమూలుదికాదు. ఆ రెండిటికీ మధ్య ఓ తలుపు కూడా ఉంటే దాని వెనుక కూడా పెద్ద కథే ఉంటుంది... అది ఓ బ్లాక్ బస్టర్ హిట్ కు కూడా నాంది పలుకవచ్చు. విషయంలోకి వస్తే ‘బాబి’ సినిమాలోకి వెళదాం. ఇది హిందీ ‘బాబి’ సుమా. రాజ్ కపూర్ కుమారుడు రిషికపూర్, డింపుల్ కపాడియా జంటగా తెరకెక్కిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ అప్పటికే హిందీలో వచ్చిన ప్రేమ కథల రికార్డులను తిరగరాసింది. ఇందులో హీరో రిషికపూర్ , హీరోయిన్ డింపుల్ కపాడియా ఇంటికి రాగానే ఆమె సున్నిపిండి రాసుకుంటూ వచ్చి తలుపు తీస్తుంది. నిజానికి ఇది రాజ్ కపూర్ స్వీయ అనుభవమే. ఆయన నిజజీవితంలో నర్గిస్ ను అలాగే కలుసుకున్నారట. దాన్ని సినిమాలో చూపించాలని ఎంతో తహతహలాడినా కథలు సహకరించలేదు. ఆ కోరికను ‘బాబి’ తీర్చింది. ఆ సినిమాలో హీరోయిన్ తొలి సన్నివేశం కూడా అదే.

దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఈ సినిమాను చిన్నపుడు చూసి థ్రిల్ అయిపోయారు . దర్శకుడయ్యాక ఇలాంటి షాట్ తీయాలని అనుకున్నా కుదరలేదట. ఆ కోరికను ‘వాళ్లిద్దరి మధ్య’ సినిమా తీర్చింది అంటారు ఆదిత్య. ‘వాళ్లిద్దరి మధ్య’ సినిమా ద్వారా పరిచయమవుతున్న హీరోయిన్ నేహాకృష్ణ పై ఇలాంటి సన్నివేశాన్నే ఆదిత్య చిత్రీకరించారు. వినాయకుడు బొమ్మ చెక్కి ఉన్న తలుపును హీరో విరాజ్ అశ్విన్ తట్టగానే , హీరోయిన్ నేహాకృష్ణ తలుపు తీస్తుంది . ఇది ఆమె కెరీర్ లో మొదటిరోజు మొదటి షాట్. ఈ వినాయకుడి

తలుపు వాళ్లిద్ధిరి ప్రేమకు ఎలాంటి విఘ్నాన్ని అయినా కలిగించవచ్చనే సందేహాన్నిప్రేక్షకులకు కలిగించే ఉద్ధేశంతోనే ఈ సింబాలిక్ షాట్ ను ఆదిత్య తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.

ఈ విషయంపై వి.ఎన్. ఆదిత్యను ప్రశ్నిస్తే ‘బాబిలోని సన్నివేశం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది . ఒక రియల్ లైఫ్ లో అంకురించిన ప్రేమ , ఒక బ్లాక్ బస్టర్ సినిమా లవ్స్టోరీ కి ఒక షాట్ అయింది. డింపుల్ కపాడియాపైన షూటింగ్ చేసిన మొదటి షాట్ కూడా అదే. ఆ దృశ్యం చిన్నప్పటినుంచీ నాతో ట్రావెల్ అవుతూనే ఉంది. ఇలాంటి సన్నివేశాన్ని తెరపై చూపించే అవకాశం నాకు ఇన్నాళ్లకు దక్కింది. అయితే ఆ కథ వేరు... ఈ కథ వేరు. అందులో సున్నిపిండి ఉంది.. ఇందులో లేదు.. అంతే తేడా ’ అని వివరించారు. తెలుగుసినిమా పరిశ్రమలోకి హీరోయిన్ నేహాకృష్ణ ప్రవేశాన్ని ఇలా విఘ్నేశ్వరుడి తలుపు ద్వారా స్వా గతించాలనే ఉద్దెశంతో కూడా ఈ సన్నివేశాన్ని తెరకెక్కించినట్టు ఆయన చెప్పారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి నిర్మాత అర్జున్ దాస్యన్.

నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ '' షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది . సినిమా చాలా బాగా వచ్చింది. అతి త్వరలోనే విడుదల తేదీ ని ప్రకటిస్తాము '' అని తెలిపారు.

తారాగణం :విరాజ్ అశ్విన్ , నేహా కృష్ణ, వెంకట్ సిద్ధారెడ్డి, బిందు చంద్రమౌళి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్ అయ్యంగార్ , నీహారికా రెడ్డి, ప్రశాంత్ సిద్ది , సుప్రజ, కృష్ణ కాంత్, అలీ ,భార్గవ్, రామకృష్ణ తదితరులు.