Vizag MP:విశాఖ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్ .. 50 కోట్లు డిమాండ్, గంటల వ్యవధిలో రక్షించిన పోలీసులు
- IndiaGlitz, [Thursday,June 15 2023]
విశాఖలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు చందు, భార్య జ్యోతి, ఆడిటర్ కిడ్నాప్ కావడం కలకలం రేపింది. దీనిపై వేగంగా స్పందించిన పోలీసులు క్షణాల వ్యవధిలో వీరి ముగ్గురు ఆచూకీని కనుగొన్నారు. విశాఖ-ఏలూరు రోడ్డులో వీరి ముగ్గురి ఆచూకీని కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌కు పాల్పడ్డారని.. వీరిలో రౌడీషీటర్ హేమంత్ కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన వీరు రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లుగా సమాచారం. తన భార్యా, కుమారుడు కిడ్నాప్ అయినట్లు తెలుసుకున్న ఎంపీ సత్యనారాయణ.. హైదరాబాద్ నుంచి హుటాహుటిన విశాఖకు బయల్దేరారు.
కిడ్నాప్ జరిగిందిలా :
విశాఖ రిషికొండలోని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. ఎంపీ భార్య, కుమారుడిని తొలుత బంధించారు. అనంతరం వారితో ఆడిటర్‌కు ఫోన్ చేయించి, ఆయను ఇంటికి రప్పించారు. ఆపై ముగ్గురిని కిడ్నాప్ చేశారు. తమకు రూ.50 కోట్లు ఇవ్వాలంటూ ఎంపీ సత్యనారాయణను బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు దాదాపు 17 బృందాలను రంగంలోకి దించి గంటల వ్యవధిలోనే కిడ్నాప్‌ను ఛేదించారు.
ఎవరీ హేమంత్ :
విశాఖ ఎంపీ సత్యనారాయణ భార్య , కుమారుడు, ఆడిటర్‌ను కిడ్నాప్ చేసింది రౌడీషీటర్ హేమంత్గా తేల్చారు. ఇతను కాంగ్రెస్ మాజీ కార్పోరేటర్ వీజారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు. నగరంలో పలు సెటిల్మెంట్లు చేస్తూ వుంటాడు. ఇతనిపై పలు హత్యలు, ఇతర కేసులు వున్నాయి. అయితే ఏకంగా ఎంపీ కుటుంబసభ్యులను ఇంట్లో నుంచే కిడ్నాప్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. త్వరలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖ నుంచే పాలన సాగిస్తామని జగన్ చెబుతున్న దశలో నగరంలోని శాంతి భద్రతలు చర్చనీయాంశమయ్యాయి.