విశాఖ గ్యాస్ లీకేజ్‌పై ఎల్జీ పాలిమర్స్ సుధీర్ఘ వివరణ..
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖపట్నంలోని ఎల్జీపాలిమర్స్ ఫ్యాక్టరీ వద్ద ఇటీవల జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 12 మంది చెందగా.. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరోవైపు.. 24 గంటల్లోనే ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేసింది. అయితే ఇక అంతా ప్రశాంతంగా ఉంది.. పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వచ్చిందనుకున్న టైమ్‌లో శనివారం బాధిత గ్రామాల ప్రజలు కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. కంపెనీ యాజమాన్యం స్పందించాలని.. తక్షణమే ఈ కంపెనీని ఇక్కడ్నుంచి తరలించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. అయితే ఘటన జరిగినప్పట్నుంచి ఇప్పటి వరకూ స్పందించని యాజమాన్యం ఎట్టకేలకు ఓ ప్రకటన రూపంలో స్పందించింది.
ప్రమాదానికి కారణమిదీ..
‘రెండు రోజుల క్రితం జరిగిన ఘటన దురదృష్టకరం. ఈ ప్రమాద బాధితులకు మా సానుభూతిని, క్షమాపణలు తెలియజేస్తున్నాం. మా కంపెనీ ప్రభుత్వం, సంబంధిత అధికారులతో కలిసి ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రాథమిక విచారణ ప్రకారం స్టైరిన్ మోనోమర్ స్టోరేజ్ ట్యాంక్ జీపీపీఎస్ దగ్గర వాపర్ లీకేజ్‌తో ప్రమాదం జరిగిందని తేలింది. ప్రస్తుతం కంపెనీలో పరిస్థితి అదుపులో ఉంది. అలాగే మేం ప్లాంట్‌లో స్టైబిలైజింగ్‌పై ఫోకస్ పెట్టాం. పూర్తిస్థాయిలో ఈ ప్రమాద బాధితులకు, ఆ కుటుంబాలకు అండగా ఉంటాం.. వారికి వీలైనంత వరకు మేలు చేస్తాం.. అంతేకాదు వారి బాధ్యతను తీసుకుంటాం. ప్లాంట్‌లో మా సిబ్బంది పగలు, రాత్రి తేడా లేకుండా ప్రభుత్వంతో కలిసి కష్టపడుతోంది. జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి సమర్థవంతమైన సంరక్షణ ప్యాకేజీని అందించడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం’ అని కంపెనీ యాజమాన్యం ప్రకటనలో రాసుకొచ్చింది.
అన్ని కుటుంబాలను సంప్రదిస్తాం..
‘ప్రమాద బాధితులు, చనిపోయిన వారి కుటుంబాలకు సాయం చేయడానికి, అండగా ఉంటాం. ఒకవేళ ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి ఓ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం. అన్ని కుటుంబాలను త్వరలోనే సంప్రదిస్తాం. ఈ టీమ్ అస్వస్థతకు గురైనవారికి అవసరమైన వైద్యం, ఇతర సాయం అందించేందుకు పని చేస్తోంది. అలాగే ప్రమాదంలో అస్వస్థతకు గురైనవారికి, బాధితులకు మానసిక స్థైర్యాన్ని నింపుతాం. భవిష్యత్‌లోనూ స్థానికుల్లో భరోసా నింపే కార్యక్రమాలు చేపడతాం. ప్రమాదం తర్వాత అస్వస్థతకు గురైనవారిని ఆస్పత్రులకు తరలించేందుకు సాయం చేసిన అధికారులు, పోలీసులకు ధన్యవాదాలు’ అని ప్రకటనలో ఎల్జీ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ప్రకటనలో రాసుకొచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments