Vivekam Review
విశాల్, సూర్య, కార్తిలకు తెలుగు సినిమా మార్కెట్‌లో కాస్తా క్రేజ్ ఉంది. తమిళంలో సీనియర్ స్టార్ హీరోలైన అజిత్, విజయ్‌లు కొంతకాలం క్రితం తమిళ సినిమా మార్కెట్‌కే పరిమితమైపోయారు. తెలుగు సినిమా మార్కెట్ పెరుగుతుండటంతో ఇప్పుడు అజిత్, విజయ్‌లు కూడా తెలుగులోకి వారి సినిమాలను ఏక కాలంలో విడుదల చేసేలా ప్లాన్స్ చేసుకుంటున్నారు. అలా తెలుగు, తమిళంలో అజిత్ హీరోగా రూపొంది ఏక కాలంలో విడుదలైన సినిమా వివేకం. అజిత్, శివ కాంబినేషన్‌లో వీరం, వేదాళం హిట్ సినిమాల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ హీరోల్లో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ నటించిన సినిమా కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి ఈ అంచనాలను సినిమా అందుకుందా లేదా అని తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం..
కథ:
అజయ్‌కుమార్ అలియాస్ ఎ.కె(అజిత్) 279 సీక్రెట్ ఆపరేషన్స్‌ను విజయవంతంగా ముగించిన ఆఫీసర్. ఓ సీక్రెట్ ఆపరేషన్ కోసం వెళ్లిన ఎ.కె. ఎవరికీ కనపడకుండా మాయమైపోతాడు. దీంతో అందరూ ఎ.కె.ను చనిపోయాడని అనుకుంటారు. అయితే సెర్బియా సరిహద్దుల్లో ఎ.కె.ప్రత్యక్షమవుతాడు. దాంతో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ రంగంలోకి దిగుతుంది. ఎ.కె.ను పట్టుకోవడానికి ఎ.కె. స్నేహితుడు, ఎ.కెకు తోడుగా ఉండే సీక్రెట్ ఏజెంట్ ఆఫీసర్ ఆర్యన్(వివేక్) సహాయం కోరుతారు. ఆర్యన్ రంగంలోకి దిగి ఎ.కె.ను వెతికి పట్టుకునే పనిలో బిజీ అవుతాడు. అసలు ఎ.కె.ఎందుకు అదృశ్యమవుతాడు. సెర్బియాలో ఎ.కెకు ఏం పని? నటాషాకు, ఎ.కె.కు ఉన్న రిలేషన్ ఏంటి? అసలు ఎ.కె. మంచివాడా? ద్రోహులెవరు అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
క్యారెక్టరైజేషన్స్:
అజయ్‌కుమార్ అలియాస్ ఎ.కె. పాత్రలో అజిత్ చాలా స్టైలిష్ లుక్‌లో కనపడ్డాడు. నటన పరంగానే కాదు, యాక్షన్ సన్నివేశాల్లో అజిత్ పెర్ఫామెన్స్ మెప్పిస్తుంది. ముఖ్యంగా ట్రెయిల్ టన్నల్‌ఫైట్‌తో పాటు క్లైమాక్స్ ఫైట్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో అజిత్ సిక్స్ ప్యాక్ అభిమానులకే పండగే. ఐదు పదుల వయసులో అజిత్ సినిమా కోసం పెట్టిన శ్రద్ధ చూస్తే మెచ్చుకోకుండా ఉండలేం.
ఇక ఎ.కె. భార్య హాసని పాత్రలో కాజల్ తన పాత్రకు న్యాయం చేసింది. పాత్ర గ్లామర్ తరహాలో కాకుండా చాలా హ్లోమిగా అనిపిస్తుంది.
ఇక ప్రతినాయక పాత్రలో వివేక్ ఒబెరాయ్ పాత్ర స్టైలిష్‌గా తెరకెక్కించాడు.
ఇక సినిమాలో శరత్‌సక్సేనా, భరత్‌రెడ్డి, కరుణాకరన్ మినహా మిగతా ఆర్టిస్టులందరూ ముఖాలు ఎవరికీ పరిచయం లేదనే చెప్పాలి. ఇక సాంకేతిక విషయాలకు వస్తే, దర్శకుడు శివ అజిత్‌తో గతంలో తెరకెక్కించిన రెండు సినిమాలు వీరం, వేదాళం సినిమాలు పక్కా మాస్ ప్రేక్షకులకు అర్థమయ్యేలా, అజిత్ ఫ్యాన్స్‌ను అలరించేలా ఉంటుంది. కానీ వివేకం ఈ రెండింటికీ భిన్నంగా తెరకెక్కింది. కథను దక్షిణాది కాదు కదా, ఇండియా కాన్సెప్ట్‌లోనే రన్ కాదు, సరే ఏదో జేమ్స్ బాండ్ మూవీ స్టైల్‌లో అనుకోవాల్సింది. అయితే అజిత్ ఫ్యాన్స్‌కు సినిమా ఏ మేర అర్థమవుతుందో తెలియడం లేదు. అణుబాంబులో భూకంపాలు, లోకేషన్స్ ఇలా పరిభాషా పదాల్లా అనిపిస్తాయనడంలో సందేహమే లేదు. వెట్రి సినిమాటోగ్రఫీతో నిర్మాత పెట్టిన ఖర్చును తెరపై చక్కగానే ప్రజెంట్ చేశాడు. అనిరుధ్ ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నీచంగా ఉన్నాయి. తెలుగు వెర్షన్ డైలాగ్స్ బాలేవు.
విశ్లేషణ:
వివేకం కథ డిజిటల్ హ్యాకింగ్ గురించి అని టైటిల్ ఫాంట్ చూస్తేనే అర్థమవుతుంది. సినిమాలోనూ ఎక్కువగా హ్యాకింగ్ మీదే ఫోకస్ చేశారు.
ఎప్పుడూ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించే అజిత్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశారు. ప్రతి సన్నివేశంలోనూ, షాట్‌లోనూ ఆయన పడ్డ కష్టం కనిపిస్తూనే ఉంది. రిస్కీ ఫైట్ లు, ట్రైన్‌ల మధ్య యాక్షన్ సీక్వెన్స్, ఛేజింగ్ సీన్‌లు, ఎత్తు నుంచి చెట్ల మీద పడటం... ఇలాంటివన్నీ అజిత్ ఫ్యాన్స్ కి నచ్చుతాయి. భర్తకు మద్దతు పలికే భార్యగా, అన్యోన్య దాంపత్యాన్ని కనబరిచే వ్యక్తిగా హాసిని పాత్రలో కాజల్ మెప్పించింది. తెరమీద కనిపించింది కాసేపే అయినా టెక్కీ నటాషాగా అక్షర హాసన్ గుర్తుండిపోతుంది. అయితే సినిమా ఆద్యంతం సైంటిఫిక్ అంశాల చుట్టూ సాగుతుంది. సాఫ్ట్ వేర్ పీపుల్‌కి ఎక్కువగా కనెక్ట్ అయ్యే సినిమాగా అనిపిస్తుంది. సన్నివేశాల్లో ఎక్కడా క్లారిటీ కనిపించదు. సినిమా మొదలై అరగంట దాటినా ఎవరు ఏమిటో, వాళ్లు దేనికోసం పోరాడుతున్నారో అర్థం కాదు. నటాషా పాత్ర దేనికి వస్తుందో.. దాని వల్ల ఏం జరుగుతుందో కూడా అర్థం కానివారు థియేటర్లో కనిపించారంటే సినిమా సగటు ప్రేక్షకుడికి ఎంత దూరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హోరెత్తించింది. సన్నివేశాల్లో లోతును పెంచాల్సిందానికి బదులు, ప్రేక్షకుడి సహనానికి, వినికిడి శక్తికి పరీక్ష పెట్టేలా సాగింది. ప్రేక్షకుడికి రిలీఫ్ ఇచ్చే వినోదాన్ని ఇందులో వెతకడం వల్ల ఫలితం శూన్యం. దర్శకుడు ఇంటర్నేనల్ స్టాండర్డ్ సినిమాలను తీయాలనుకున్న క్రమంలో సౌత్ ఇండియాలోని కామన్‌మేన్ ని మర్చిపోయాడేమోనని అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ సీక్రెట్ ఏజెంట్స్, సిగ్నల్స్ హ్యాకింగ్, రీ హ్యాకింగ్ వంటి విషయాలను గబగబా అర్థం చేసేసుకునే పరిపక్వత ఇంకా మన జనల్లో అంతగా లేదనేది ఒప్పుకోవాల్సిన విషయం. ఇలాంటి అంశాలు అర్థం కాకపోవడం వల్ల ఈ మధ్య కూడా కొన్ని సినిమాలు మన దగ్గర బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయాయి. పైగా అజిత్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు ఇంత కష్టపడి చేసిన సినిమాలో కనీసపక్షం కామెడీ కూడా లేకపోవడం మన సగటు ప్రేక్షకుడికి జీర్ణం కాని విషయం. అక్షర హాసన్, కాజల్ ఇద్దరు నాయికలున్నా.. సినిమాలో గ్లామర్ లేదు. పైగా ప్రేక్షకుడు ఊపిరి కూడా పీల్చుకోవడానికి వీల్లేనంత వేగంగా కథ, షాట్‌లు సాగుతూనే ఉంటాయి.ఎన్నో అంచనాలతో థియేటర్‌లోకి వెళ్లే అజిత్ అభిమానులు, ప్రేక్షకులు నిరాశ తప్పదు.
బోటమ్ లైన్: వివేకం..యాక్షన్‌కే పరిమితం
Vivekam Movie Review in English
- Read in English