పార్టీ మారే విషయమై స్పందించిన వివేక్ వెంకటస్వామి
- IndiaGlitz, [Monday,December 28 2020]
మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు వివేక్ వెంకటస్వామి త్వరలో పార్టీ మారబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై నేడు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక వెనుక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోద్బలముందనే కచ్చితమైన సమాచారం తనకు ఉందని తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేసేందుకే తాను బీజేపీలో చేరానని వెల్లడించారు. దీనిని దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా కొంతమేర సాధించానని వివేక్ వెంకటస్వామి తెలిపారు. కాగా.. తన ఆస్తులపై సీబీఐ విచారణ కోరేందుకు తాను సిద్ధమని.. మీ కుటుంబ ఆస్తులపై విచారణకు మీరు సిద్ధమా? అని కేసీఆర్కు సవాల్ విసిరారు.
‘‘గత కొద్దిరోజులుగా నేను పార్టీ మారుతున్నట్లు టీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియాలో టీఆర్ఎస్కు చెందిన వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు. దీని వెనక కేసీఆర్, కేటీఆర్ ప్రొద్బలం ఉందని నాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. కేసీఆర్ కుటుంబ పాలన అంతానికే నేను బీజేపీలో చేరాను. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా నా టార్గెట్ ను కొంతమేరకు సాధించాను. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను మట్టి కరిపించడమే తదుపరి లక్ష్యం. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ఆస్తులపై సీబీఐ విచారణ కోరెందుకు నేను సిధ్దం, మీరు మీ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణకు మీరు సిద్దమా కేసీఆర్ ?’’ అని వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు.