‘‘ది కాశ్మీర్ ఫైల్స్’’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి బెదిరింపులు.. కేంద్రం సీరియస్ , ‘వై’కేటగిరీ భద్రతకు గ్రీన్ సిగ్నల్
- IndiaGlitz, [Friday,March 18 2022]
1990వ దశకంలో జమ్మూకాశ్మీర్‌లో చోటు చేసుకున్న కాశ్మీరి పండిట్ల ఊచకోతను ఆధారంగా చేసుకుని వివేక్ తెరకెక్కిన ‘‘ది కశ్మీర్ ఫైల్స్’’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా.. కేవలం కథకు మాత్రమే పెద్ద పీట వేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే మంచి కలెక్షన్స్ సైతం రాబడుతోంది. ఇప్పటికే ఈ చిత్ర బృందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సైతం అభినందించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చిత్ర యూనిట్‌ను స్వయంగా పిలిపించుకుని అభినందించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్స్ ను సాధించిందంటే ఈ సినిమా ఊపును అర్ధం చేసుకోవచ్చు. అయితే కథ ప్రకారం.. ఓ వర్గాన్ని కాస్త వ్యతిరేకంగా చూపించడంతో కాశ్మీర్ ఫైల్స్‌ను తిట్టేవాళ్లు కూడా ఉన్నారు. వన్ సైడెడ్ స్టోరీగా సినిమా ఉందని.. చాలా మంది దర్శకుడు వివేక్ ను విమర్శిస్తున్నారు. కొందరైతే వివేక్ ని బెదిరిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. వివేక్ అగ్నిహోత్రికి 'Y' కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వనుంది కేంద్రం. మొత్తం ఎనిమిది మంది పోలీసులు వివేక్ భద్రతను పర్యవేక్షించనున్నారు. గతంలో బాలీవుడ్ అగ్రకథానాయిక కంగనా రనౌత్‌కు కూడా కేంద్రం వై కేటగిరీ భద్రతను కల్పించిన సంగతి తెలిసిందే.