Vishwaroopam 2 Review
సీక్వెల్స్ కి మన దగ్గర ఇంతకు ముందు పెద్ద ఆదరణ లేదు. చెప్పాల్సిందంతా తొలి సగంలోనే చెప్పేయడం, మలిసగం నిస్సత్తువగా ఉండటం వంటివి ఆయా సినిమాల ఫెయిల్యూర్లకు కారణాలు. అయితే బాహుబలి సీక్వెల్ మెప్పించింది. దీంతో సీక్వెల్స్ మీద ఆదరణ పెరిగింది. విశ్వరూపం చిత్రాన్ని కూడా మొదట్లోనే రెండు భాగాలుగా విడుదల చేయాలన్నది కమల్‌హాసన్ సంకల్పం. ఆ విషయాన్ని ఆయన తొలిభాగం ప్రచారం సమయంలోనే చెప్పేశారు. రెండో సగాన్ని అప్పుడే విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఇప్పటికి కుదిరింది. యుద్ధాలు, స్పై, కథక్.. ఇన్వెస్టిగేషన్ అంటూ సాగిన తొలి సగానికి ఇప్పుడు సీక్వెల్ వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? లేక గత సీక్వెల్స్ లాగా నసగా మిగులుతుందా.. రివ్యూ చదవండి.
కథ:
ఓమర్(రాహుల్ దేవ్) లండన్ నగరంలో చేయాలనుకున్న బ్లాస్ట్‌ని రా ఏజెంట్ విసాద్ అహ్మద్(కమల్ హాసన్) భగ్నం చేస్తాడు. అయితే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లండన్ దగ్గరనున్న సముద్ర తీరంలో అణు ఆయుధాలున్న జర్మన్ నౌక మునిగిపోయింది. దానిలోని అణు ఆయుధాలను యాక్టివేట్ చేస్తే సునామీ వస్తుంది. దాంతో లండన్ నగరం నాశనం అయిపోతుందని ఓమర్ ప్లాన్ చేస్తాడు. దాన్ని పసిగట్టిన విసాద్ తన భార్య నిరుపమ(పూజా కుమార్) సహాయంతో అడ్డుకుంటాడు. ఇండియా చేరుకున్న విసాద్.. ఓమర్ ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఓమర్ గ్యాంగ్ ఈలోపు నిరుపమ, అశ్రిత సహా విసాద్ తల్లిని కూడా కిడ్నాప్ చేస్తారు. వాళ్లను కాపాడుకోవడానికి విసాద్ ఏం చేస్తాడు? వాళ్లను కాపాడే క్రమంలో విసాద్ ఏం కోల్పోతాడు? ఓమర్ ఇండియా నాశనానికి ఎలాంటి ప్లాన్ చేస్తాడు? దాన్ని విసాద్ ఎలా అడ్డుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
కమల్ హాసన్ నటన గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. రా ఏజెంట్‌గా, అల్జీమర్స్‌తో బాధపడే తల్లికి కొడుకుగా.. భార్యను కాపాడుకోవాలనుకునే భర్తగా చక్కగా నటించాడు. నటుడిగానే కాదు.. దర్శకత్వం పరంగా కూడా సినిమాను చక్కగా తెరకెక్కించారు. ఇక శామ్‌దత్, షైనుదీన్, షను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీలో సినిమా చాలా రిచ్‌గా కనపడింది. అలాగే నిర్మాణ విలువలు బావున్నాయి. ఇక వయసు మీదపడుతున్నా కూడా కమల్ ఎలాంటి డూప్స్ లేకుండా చేసిన యాక్షన్ సీన్స్ మెప్పిస్తాయి. అలాగే ఫస్టాఫ్‌లో సముద్ర తీరంలో వచ్చే సీన్స్‌లో సీజీ వర్క్ బావుంది. రాజకీయాలు.. తీవ్రవాదం.. అనే అంశాలపై ఓ సందర్భంలో కమల్ వేసే పంచులు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్:
విశ్వరూపం పార్ట్ వన్‌లో నేపథ్య సంగీతం చాలా చక్కగా ఉంది. ప్రేక్షకుల మనసులను తాకింది. అయితే ఈ సినిమా నేపథ్య సంగీతం పార్ట్ వన్ స్థాయిలో లేదు. ఇక ఇండియాలో పార్ట్ 2 అన్నారు కానీ.. పార్ట్ 2లోని ఫస్టాఫ్ అంతా లండన్‌లోనే రన్ అవుతుంది. సెకండాఫ్ మాత్రమే ఇండియాలో ఉంటుంది. పార్ట్ వన్‌లోని ఆసక్తి పార్ట్ 2లో లేదు. సన్నివేశాలను గ్రిప్పింగ్‌గా రాసుకోకపోవడమే అందుకు కారణం. సినిమా ఫస్టాఫ్ నడిచే తీరుతో ప్రేక్షకుడు సినిమా ఎక్కడికి వెళుతుందనే కన్‌ఫ్యూజన్‌కి లోనవుతాడు. పార్ట్ వన్ వచ్చి చాలాకాలం కావడంతో ప్రేక్షకులకు కనెక్టింగ్ పాయింట్స్ కనెక్ట్ కావు.
విశ్లేషణ:
విశ్వరూపం పార్ట్ 2013లో విడుదలైంది. దాదాపు ఐదేళ్ల తర్వాత పార్ట్ 2 వచ్చింది. పార్ట్ వన్‌కి మంచి ఆదరణ రావడంతో పార్ట్ 2 ఎలా ఉంటుందోనని అంచనాలైతే పెరిగాయి. అలాగే పార్ట్ వన్‌లో చాలా ప్రశ్నలు ఆడియెన్‌కి మిగిలిపోయాయి. వాటన్నిటికీ పార్ట్ 2లో సమాధానాలు దొరికినా.. సన్నివేశాలు గ్రిప్పింగ్ గా లేవు. అలాగే పార్ట్ వన్‌లో గ్లామర్.. భార్య భర్తల మధ్య ఎమోషన్స్ అన్నీ మిస్ అయ్యాయి. అవన్నీ పార్ట్‌లో కనపడతాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. నటీనటులు పరంగా సాంకేతికత పరంగా సినిమా బావుంది. లొకేషన్స్ అన్నీ రిచ్‌గా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు పార్ట్ వన్‌లో ఉన్నంత బాగా పార్ట్ 2లో లేవు. మొత్తంగా పార్ట్ వన్ కంటే పార్ట్ 2 విశ్వరూపం మెప్పించేంత లేదు.
బోటమ్ లైన్: విశ్వరూపం 2... ఆశించినంత భారీగా , కనెక్టింగ్‌గా లేదు.
Vishwaroopam-2 Movie Review in English
- Read in English