Kannappa :విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ కన్నప్పతో మంచు వారసుడు అరంగేట్రం

  • IndiaGlitz, [Friday,January 05 2024]

మంచు హీరో విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్టు అయిన 'కన్నప్ప ' (Kannappa) మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే న్యూజిలాండ్‌‌లో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది. ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, కిచ్చా సుదీప్, మోహన్ బాబు లాంటి భారీ తారాగణం నటిస్తోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు తాజాగా మేకర్స్ మరో అప్‌డేట్ ఇచ్చారు. మూవీలో మంచు కుటుంబానికి చెందిన మూడు తరాలు నటించనున్నారని తెలిపారు.

విష్ణు ఐదేళ్ల కుమారుడు మంచు అవ్రామ్ కన్నప్ప మూవీతో వెండితెర అరంగేట్రం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విష్ణు స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ‘ఈ కన్నప్ప సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం చాలా గర్వకారణం. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు. ఇది మా కుటుంబం యొక్క మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం. 'కన్నప్ప' ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది. ఇది మా కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది’ అని చెప్పుకొచ్చారు. దీంతో మోహన్ బాబు, విష్ణు, అవ్రామ్ ఇలా మూడు తరాలకు చెందిన మంచు కుటుంబ సభ్యులు నటించడం విశేషం.

ఇక న్యూజిలాండ్‌లోని సుందరమైన ప్రకృతి దృశ్యాల నడుమ 90 రోజులు నిర్విరామంగా షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల విష్ణు పుట్టినరోజు సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా విశేషమైన స్పందన వచ్చింది. భారీ బడ్జెట్‌లో పాన్ వరల్డ్ రేంజ్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెచా ఫైట్స్ చేస్తుండగా.. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్ర కథకి కీలక మెరుగులు దిద్దగా.. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తున్నారు.