నిజాలు తేల్చేందుకు నేను సిద్ధం: విష్ణు సవాల్
- IndiaGlitz, [Thursday,March 07 2019]
మంచు ఫ్యామిలీకి చెందిన విద్యానికేతన విద్యా సంస్థలకు ఫీజు రియింబర్స్‌మెంట్ రావట్లేదని.. ప్రభుత్వం పనిగట్టుకుని తమ సంస్థలకు ఫీజు బకాయిలు రాకుండా ఆపేసిందని నటుడు మంచు మోహన్‌బాబు ఇప్పటికే పలుమార్లు ప్రెస్‌మీట్ పెట్టడంతో పాటు చంద్రబాబుకు నేరుగా ఉత్తరాలు రాసినట్లు చెప్పిన విషయం విదితమే. తాజాగా ఈ వ్యవహారంపై ఆయన కుమారుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈవో మంచు విష్ణు స్పందించారు. విద్యా సంస్థలు అంటే పిల్లల భవిష్యత్తు అని వారి తల్లిదండ్రుల సంతృప్తే మనకు ముఖ్యమన్నారు. విద్యా సంస్థలు ఏ పార్టీకి కొమ్ముకాయకుండా ఉంటే మంచిదన్నారు.
ఇదేంటి శాంతారాం..!?
ఇటీవల ఫీజురియంబర్స్‌మెంట్ విషయమై మోహన్‌బాబు ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు.. శాంతరాం ఇంజనీరింగ్ కాలేజీ అధినేత శాంతారాముడు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రభుత్వానికి కొమ్ముకాయడంపై మంచు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక రిజిస్టర్ చేసుకున్న వ్యవస్థ.. సంస్థ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి లేదా ప్రభుత్వానికి లేదా రాజకీయ పార్టీగానీ మద్దతు తెలపకూడదన్నారు. ఎన్నోసార్లు ఈ సంస్థ నిర్వహించిన సమావేశాల్లో కాలేజీలకు రావాల్సిన ఫీజు బకాయిల గురించి చర్చించినట్లు గుర్తుచేశారు. శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ మోహన్‌బాబు అధ్యక్షతన ముఖ్యమంత్రిని కలవాలని ప్రతిపాదించడం కూడా జరిగిందన్నారు. మీకు (శాంతారం) ప్రభుత్వంపై అంత ప్రేమవుంటే వ్యక్తిగతంగా మద్దతు తెలుపుకోవాలని ఈ సందర్భంగా విష్ణు సూచించారు.
ప్రతీసారి సీఎంను కలవాల్సిందేనా..!?
2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు, మూడు త్రైమాసిక ఫీజు బకాయిల గురించి కలిశామని కూడా అపెక్మా చెప్పిందన్నారు. అయితే ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యం ప్రతిసారి వెళ్లి ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తే కానీ ఫీజు బకాయిలు విడుదల కావడంలేదని అర్థమవుతుందన్నారు. అలాంటప్పుడు ఫీజు బకాయిలు సక్రమంగా వస్తున్నాయని, ప్రభుత్వం సక్రమంగా చెల్లిస్తుందని పత్రికా ప్రకటన ఇవ్వడం ఎంతవరకు వాస్తవమో అపెక్మా చెప్పాలని కోరారు. ప్రభుత్వం జాప్యం ద్వారా ఎన్నో కళాశాలల యాజమాన్యాలు కక్కలేక.. మింగలేక సతమవుతూ ఆవేదన చెందుతున్నాయన్నారు. తమ ఆస్తులను తాకట్టుపెట్టి ఉద్యోగస్థులకు వేతనాలను అందించే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ మా బకాయిలు..!?
అపెక్మా చెప్పినట్లుగా ప్రభుత్వం ఫీజు బకాయిలు సక్రమంగా చెల్లిస్తుంటే తమ విద్యాసంస్థకు రూ.16,35,16,900 ఎందుకు బకాయి ఉందని ప్రశ్నించారు. అందులో 2017-18 విద్యా సంవత్సరానికే దాదాపు రూ.1,84,98,675 రావాల్సి ఉందన్నారు. ఈ విషయం అపెక్మాకు తెలియంది కాదన్నారు. ఈ కారణాల వల్ల ఎన్నో కళాశాలలు సతమతవుతూ బాధపడుతున్నాయని తెలిపారు. ఒక అసోసియేషన్‌గా రిజిస్టర్ అయినప్పుడు సభ్యులందరినీ కలుపుకొని పత్రికా ప్రకటన చేయడం సమంజసమని సూచించారు. కాబట్టి, ఫీజు బకాయిల గురించి శ్రీవిద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ ఎం.మోహన్‌బాబు ఇచ్చిన పత్రికా ప్రకటనకు.. అపెక్మా ఇచ్చిన ప్రకటనకు సంబంధించిన నిజానిజాలను నిరూపించడానికి తమ కళాశాలలో కానీ, మీ కళాశాల ప్రాంగణంలో కానీ అపెక్మా అసోసియేషన్ సభ్యుల సమక్షంలో చర్చించేందుకు తాము సిద్ధమని విష్ణు చెప్పారు.