Vishal: తమిళనాట వేడెక్కిన రాజకీయాలు.. కొత్త పార్టీ పెడతానంటూ విశాల్ సంచలన ప్రకటన..
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిగా మారతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు మాత్రమే ఉండటంతో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరోలు వరుసగా రాజకీయాల్లోకి వస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే సొంతంగా పార్టీ కూడా పెట్టుకున్నారు. 'తమిళగ వెట్రి కళగం' అనే పేరుతో సొంత పార్టీని ప్రకటించి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఇతర పార్టీలకు భారీ షాక్ తగిలినట్లైంది.
తాజాగా మరో స్టార్ హీరో కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు వాడైనా సరే తన సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన విశాల్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా సొంతంగా పార్టీ కూడా పెడతానని చెప్పడం సంచలనంగా మారింది. చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్ తన రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చారు. "త్వరలోనే నేను రాజకీయాల్లోకి వస్తున్నా. సొంతంగా పొలిటికల్ పార్టీని స్థాపించి 2026 లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా. ప్రస్తుతం ప్రజలకు సరైన వసతులు లేవు. వారికి సేవ చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఆ ఉద్దేశంతోనే నేను రాజకీయాలకు వస్తున్నా" అని స్పష్టంచేశారు.
పార్టీలతో పొత్తుల గురించి మాట్లాడుతూ రాజకీయాల్లో ముందు తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నా అని తెలిపారు. ఆ తర్వాతే మిగిలిన విషయాలు, పొత్తు గురించి ఆలోచిస్తా అంటూ పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం విశాల్ పొలిటికల్ ఎంట్రీ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. వాస్తవంగా విశాల్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో ఆయన పోటీ చేసి సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఆయన ప్యానల్ తరఫున పోటీ చేసిన నాజర్ ప్రెసిడెంట్ అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. అయితే సరైన పత్రాలు లేవంటూ రిటర్నింగ్ అధికారులు ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు.
ఇదిలా ఉంటే తమిళనాడు రాజకీయాలతో తొలి నుంచి సినీ ఇండస్ట్రీకి సంబంధం ఉంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజ నేతలు చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం ఏకంగా ముఖ్యమంత్రులు అయి ఏళ్ల పాటు పాలించారు. అయితే వారి మరణం తర్వాత ఇప్పటివరకు ఏ సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి కాలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఓ దశలో ఆయన కూడా సొంతంగా పార్టీ పెట్టాలని భావించారు. అయితే ఏమైందో ఏమో తాను రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఇక లోకనాయకుడు కమల్ హాసన్ పార్టీ పెట్టినా అక్కడి రాజకీయాల్లో తనదైన ముద్ర వేయలేకపోయారు. 2021లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఇలాంటి తరుణంలో విజయ్, విశాల్ సొంతంగా పార్టీ పెట్టుకుంటూ రాజకీయాల్లోకి రావడం హాట్ టాపిక్‌గా మారింది. తమిళ రాజకీయాల్లో సినీ పరిశ్రమ తరపున వీరిద్దరు బలమైన ముద్ర వేసి ముఖ్యమంత్రిగా అవుతారా.. లేదంటే ఫెయిల్యూర్ రాజకీయ నాయకులుగా మిగిలిపోతారా తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments