స్పేస్ వదిలిన ఆర్ఆర్ఆర్.. చిన్న సినిమాల జోరు, తెలుగు బాక్సాఫీస్‌పై విశాల్- అజిత్ దండయాత్ర

  • IndiaGlitz, [Tuesday,January 04 2022]

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద సీజన్. పండుగను కుటంబంతో కలిసి జరుపుకునేందుకు ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా స్వగ్రామాలకు తరలివస్తారు. కుటుంబసభ్యులు, ఆత్మీయులు, మిత్రులతో పండుగ చేసుకుని వినోదం కోసం సినిమాలకు వెళ్తుంటారు. అందుకే సంక్రాంతి సమయంలో ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరిస్తారు ప్రేక్షకులు. సినిమా ఎలా వున్నా సరే.. మంచి వసూళ్లు గ్యారెంటీ.

గడిచిన రెండేళ్లుగా కోవిడ్ కారణంగా కళ తప్పిన తెలుగు సినిమా .. ఈ ఏడాది గట్టిగానే ప్లాన్ చేసుకున్నాయి. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి సినిమాలు రిలీజ్‌ను పెట్టుకున్నాయి. దీంతో ఈసారి బాక్సాఫీస్ కళకళలాడుతుందని అంతా భావించారు . కానీ ఒమిక్రాన్ ఎఫెక్ట్‌‌కు తోడు కరోనా కేసులు తిరగబెడుతున్న కారణం చేత అనేక రాష్ట్రాల్లో థియేటర్లలో 50 శాత్యం ఆక్యూపెన్సీకే ప్రభుత్వం అనుమతించింది. దీనికి తోడు నైట్ కర్ఫ్యూలు అదనం. ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో సినిమా రిలీజ్ చేస్తే పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని నిర్మాతలు భయపడుతున్నారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరి నుంచి తప్పుకోగా.. రాధేశ్యామ్ సైతం ఇదే బాటలో నడుస్తుందని ప్రచారం జరుగుతోంది.

రెండు భారీ సినిమాలు పక్కకు తప్పుకుంటే ఈ గ్యాప్‌ను కవర్ చేసేందుకు చిన్న సినిమాలు రిలీజ్ కి క్యూ కట్టాయి. ఎన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతికి దాదాపు అరడజనుకి పైగా చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. వీటితో పాటు రెండు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతాయని సమాచారం. విశాల్ హీరోగా తు.ప.శరవణన్‌ దర్శకత్వం వహిస్తోన్న 'సామాన్యుడు' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో విశాల్ సరసన డింపుల్‌ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను కోలీవుడ్ తో పాటు తెలుగులో సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.

విశాల్ సినిమాతో పాటు తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ నటించిన ‘వాలిమై' కూడా రాబోతుంది. సామాన్యుడికి ఒకరోజు ముందుగా జనవరి 13న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. అజిత్, విశాల్‌లకు తెలుగులో మంచి క్రేజ్ ఉండడంతో ఈ రెండు సినిమాలు భారీ కలెక్షన్స్‌ను రాబడతాయని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు లేని లోటును డబ్బింగ్ సినిమాలు, చిన్న సినిమాలు తీర్చనున్నాయన్న మాట.