Vishaka Train: విశాఖ రైలు 9 గంటలు ఆలస్యం.. ఓటు వేస్తామా..? లేదా..? అనే ఆందోళన..
Send us your feedback to audioarticles@vaarta.com
మన దేశంలో రైళ్ల ప్రయాణం గురించి ఓ సినీ కవి వ్యంగ్యంగా ఓ మాట చెప్పాడు. నువ్వు ఎక్కాల్సిన రైలు.. జీవితకాలం లేటు అని. ఆయన ఆ మాట ఎందుకు చెప్పాడో ఇప్పుడు ఏపీకి వచ్చే కొంతమంది ప్రయాణికులకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఎలా అంటే హైదరాబాద్‌లో ఉండే ఏపీ వాసులు.. ఎన్నికల్లో ఓటు వేద్దామని సొంతూళ్లకు బయల్దేరారు. చాలా ముందుగానే రిజర్వేషన్లు కూడా చేసుకున్నారు. ఇకేముంది నిశ్చింతగా ఓటేయవచ్చని అనుకున్నారు. కానీ పరిస్థితి మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. పోలింగ్ రోజు రైలు ఆలస్యం కావటంతో ఇప్పుడు ఓటుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
అసలు ఏం జరిగిందంటే విశాఖపట్నం వైపు వెళ్లాల్సిన ప్రయాణికులు నాదేండ్- విశాఖఫట్నం ఎక్స్‌ప్రెస్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు మే 12వ తేదీ రాత్రి 9గంటల 30 నిమిషాలకు రావాల్సిన రైలు ఆలస్యమైంది. అయితే ఒకటీ కాదు రెండు గంటలు కాదు.. ఏకంగా 5 గంటలు లేట్‌గా వచ్చింది. 12వ తేదీ రాత్రి 9:30 నిమిషాలకు సికింద్రాబాద్ రావాల్సిన రైలు.. మే 13వ తేదీ తెల్లవారజామున 4 గంటలకు స్టేషన్‌కు చేరుకుంది. రైలు కాస్త ఆలస్యమైనా సాయంత్రానికల్లా విశాఖ చేరుకుంటామని.. ఆరు గంటల వరకూ పోలింగ్ గడువు ఉండటంతో ఓటు వేస్తామనే ధీమాతో ప్రయాణికులు రైలు ఎక్కారు.
అయితే అక్కడి నుంచి నాందేడ్ ఎక్స్‌ప్రెస్ పయనం మరింత నెమ్మదించింది. ప్రస్తుతం నాందేడ్- విశాఖ రైలు 9 గంటలు ఆలస్యంగా నడుస్తుండగా.. విశాఖ చేరుకునేసరికి సాయంత్రం 6 గంటలు దాటిపోయే పరిస్థితి ఉంది. దీంతో రైల్లో ప్రయాణిస్తున్న ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు జరుగుతాయని.. రైల్వే తీరుతో తాము పోలింగ్‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నం వరకు వెళ్లే వారు ఉన్నారు. వీరంతా తమ పరిస్థితిని ఎన్నికల సంఘానికి సైతం తెలియజేశారు. సమయం మించిపోయినా తమకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మరి వీరి విజ్ఞప్తి కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరోవైపు ఏపీలో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, వృద్ధులు ఓటు వేసేందుకు క్యూ కట్టారు. రూరల్ ఏరియాలతో పాటు అర్బన్ ఏరియాల్లోనూ ఓటింగ్ శాతం పెరుగుతుండంట శుభ పరిణామంగా అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 50శాతం పోలింగ్ నమోదైంది. దీంతో పోలింగ్ సమయం ముగిసే నాటికి 80శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి విజయం అందిస్తుందో జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments