Godavari Express:పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్.. తృటిలో తప్పిన పెనుప్రమాదం, నెమ్మదిగా వెళ్లడమే కాపాడింది
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ నగర శివార్లలో పెను రైల్వే ప్రమాదం తృటిలో తప్పిపోయింది. విశాఖ- హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని అంకుషాపూర్ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైలు వేగం తక్కువగా వుండటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా వున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఎస్ 1, ఎస్ 4, జీఎస్, ఎస్ఎల్ఆర్ కోచ్‌లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక, రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పట్టాలు తప్పిన బోగీలను వేరు చేసి.. మరో రైలులో ప్రయాణికులను గమ్యస్థానానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో ప్రయాణీకులు, వారి కుటుంబ సభ్యుల కోసం రైల్వే శాఖ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. 040-27786666 నెంబర్‌కు సంప్రదించవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్దరణ పనులు:
గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు స్టేషన్‌లలో రైళ్లను నిలిపివేశారు. ట్రాక్ మరమ్మత్తు పనులు పూర్తయిన తర్వాత ఇవి యథావిధిగా నడవనున్నాయి. ఇదిలావుండగా...గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన నేపథ్యంలో ఘట్‌కేసర్ స్టేషన్ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టింది రైల్వే శాఖ. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది, కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైల్వే అధికారులు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
దశాబ్ధాలుగా సేవలందిస్తోన్న గోదావరి ఎక్స్‌ప్రెస్:
విశాఖ-హైదరాబాద్ నగరాల మధ్య నడిచే (12727) గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటలకు విశాఖలో బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 6.15 గంటలకు హైదరాబాద్ (నాంపల్లి) చేరుకుంటుంది. ఉత్తరాంధ్ర ప్రజలు భాగ్యనగరానికి చేరుకోవడానికి దశాబ్ధాల నుంచి ఈ రైలునే వినియోగిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout